Cold Wave Increased In Telangana: సాధారణంగా కార్తీక మాసం ప్రారంభమైందంటే చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. బయటకు వెళ్లాలంటేనే శరీరం గజగజ వణుకుతుంది. ఈసారి మారిన వాతావరణ పరిస్థితుల వల్ల చలి చుక్కలు చూపిస్తోంది. సాయంత్రం ఐదు గంటలకే సూర్యుడు ముఖం చాటిస్తున్నాడు. ఈదురుగాలులతో వాతావరణం అంతా ఇగం పెడుతోంది. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈదురుగాలుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడంతో కాశ్మీర్ లో ఉన్నట్టుందని ప్రజలు వాపోతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో విద్యుత్ డిమాండ్ కూడా పడిపోయింది.

మూడు రోజులుగా ఇదే పరిస్థితి
బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో దీపావళికి ముందు నుంచే ఈదురు గాలులు వీచాయి. గత మూడేళ్లల్లో ఎన్నడు కూడా ఇలాంటి వాతావరణం లేదు.. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది.. శనివారం వరకు 55 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదయింది. ఆ తర్వాత వరుసగా మూడు రోజులు 45 మిలియన్ యూనిట్లకు తగ్గింది. హైదరాబాదులో సాధారణంగా 19 నుంచి 20 డిగ్రీల వరకు నమోదు కావలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. చలి పెరగడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం తగ్గిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. గ్రేటర్ హైదరాబాదులోని 9 సర్కిళ్ళు, 54 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. సాధారణంగా 50 నుంచి 55 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదు అవుతూ ఉంటుంది.

వేసవిలో అయితే రికార్డు స్థాయిలో 70 మిలియన్ యూనిట్ల వరకు చేరుకుంటుంది. కానీ ప్రస్తుతం చలితో పాటు వరుస సెలవులు రావడంతో ప్రజలు సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. ఇది కూడా విద్యుత్ డిమాండ్ తగ్గడానికి కారణమని అధికారులు అంటున్నారు. ఇక ఉమ్మడి మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలు చలికి వణుకుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం మెదక్ జిల్లా నత్నాయిపల్లిలో 8.7, రంగారెడ్డి జిల్లా మల్చెల్మా లో 12, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 13.2 డిగ్రీల కానిస్టేబుల్ ఉష్ణోగ్రత నమోదయింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ వైపు తరలిపోవడంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతంలో ఒక డిగ్రీ మేరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మరొక వారం పాటు పొడి వాతావరణమే ఉంటుందని వారు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల్లో అధిక తేమ ఉండటం వల్ల వాతావరణం చల్లగా మారుతున్నదని అధికారులు చెబుతున్నారు. కాగా మారిన వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు.