Pawan Kalyan- Roja: వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా మంత్రి రోజాకు పేరుంది. దూకుడు స్వభావంతోనే ఆమెకు అధిష్టానం గుర్తించి మంత్రి పదవి కట్టబెట్టింది. అయితే మంత్రి అయిన తరువాత ఆమె మరింత దూసుకెళతారని అంతా భావించారు. కానీ ఎందుకో సైలెంట్ అవుతున్నారు. దీనికి తన సొంత నియోజకవర్గంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులే కారణం. గత ఎన్నికల్లో ఆమె తక్కువ మెజార్టీతొనే గట్టెక్కారు. అంతకు ముందు 2014 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. అయితే ఆది నుంచి రోజా అంటే నియోజకవర్గంలో పొసగని నేతలు చాలామంది ఉన్నారు. గత ఎన్నికల్లో వారంతా వ్యతిరేకంగా పనిచేయడంతో చచ్చీ చెడి అత్తెసరు ఓట్లతో రోజా బయటపడగలిగారు. నాడు రోజా కూడా అదే విషయాన్ని ప్రకటించారు. సొంత పార్టీ వారే తనను ఓడించడానికి ప్రయత్నించారని.. కానీ ప్రజల బలంతో గెలిచానని కూడా చెప్పారు. అయితే నాడు వ్యతిరేకంగా పనిచేసిన వర్గానికి చిత్తూరు జిల్లాకు చెందిన అగ్రనేత హస్తం ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు రోజాకు మంత్రి పదవి ఇచ్చి అధిష్టానం ప్రోత్సహించిన విధంగానే.. ఆమె వ్యతిరేకవర్గానికి జిల్లా నేత సపోర్టు చేయడంతో వారు మరింత బలం పెంచుకుంటున్నారు.

నగిరి నియోజకవర్గంలో ఓ అరడజను మంది నాయకులు రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో చక్రపాణి రెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో ఈయనకు పట్టుంది. వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకుల సహకారం బట్టి రోజా గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అయితే గత రెండు ఎన్నికల్లో బోటాబోటీ మెజార్టీతో నెట్టుకొచ్చిన రోజా.. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎదురీత తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో నగిరి నియోజకవర్గ రివ్యూ తాడేపల్లిలో సీఎం జగన్ చేపట్టనున్నారు. అక్కడ అసమ్మతి నాయకులపై రోజా ఏం చెబుతారో? మంత్రి రోజా వైఖరిపై అసమ్మతి నేతలు ఎటువంటి ఫిర్యాదుచేస్తారో? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే నగిరిలో పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదని అధిష్టానానికి ఇప్పటికే నివేదికలు అందినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి జనసేనాని పవన్ సైతం నగిరి నియోజకవర్గంలో పట్టుబిగిస్తున్నారు. తనపై వ్యక్తిగత కామెంట్స్ చేసే రోజాను ఓడించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. తాను టార్గెట్ చేసుకున్న పది మంది వైసీపీ నేతల జాబితాలో రోజా సైతం ఉన్నారు. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ జరిగినా.. పొత్తుల్లో భాగంగా ఫైట్ జరిగినా.. అల్టిమేట్ గా అది రోజాను ఓడించడమేనన్న స్ట్రాంగ్ నిర్ణయానికి పవన్ వచ్చినట్టు తెలుస్తోంది.
సొంత పార్టీలో వ్యవహారాలు రోజాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నా.. ప్రత్యర్థి పార్టీలో నెలకొన్న పరిణామాలు రోజాకు ఉపశమనమిస్తున్నాయి. గత ఎన్నికల్లో గాలి ముద్దు క్రిష్ణమనాయుడు కుమారుడు భాను పోటీచేశారు. రోజాకు గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఈా గాలి కుటుంబంలో ప్రస్తుతం విభేదాలు నెలకొన్నాయి. భానుకు సోదరుడు జగదీషే వ్యతిరేకంగా మారాడు. దీనిని రోజా క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ, టీడీపీ.. రెండు పార్టీల్లోనూ అసమ్మతి ఉంది. దానిని నియంత్రించే బాధ్యతలను అధినేతలు తీసుకుంటున్నారు. త్వరలో నగిరి నియోజకవర్గ రివ్యూకు సీఎం జగన్ సిద్ధపడుతున్నారు. ఇప్పటికే తెప్పించుకున్న నివేదికల ప్రాప్తికి అటు మంత్రి రోజాకు, ఇటు అసమ్మతి నేతలకు స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు జారీచేసే అవకాశముంది.

అటు చంద్రబాబు కూడా నగిరిలో పార్టీ పరిస్థితులను గాడిలో పెట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. గాలి కుటుంబాన్ని ఒక చోటకు చేర్చి పంచాయతీని పరిష్కరించనున్నారు. కుటుంబంలో విభేదాలతో పార్టీ నష్టపోతోందని ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం మంత్రి రోజా పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పార్టీకి ఆదరణ బాగుంది. ఈ సమయంలో పార్టీ పటిష్టతకు సహకరించాల్సిపోయి ఆధిపత్యం కోసం గాలి కుమారులు ప్రయత్నిస్తుండడంపై చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాలి కుమారులు దారిలోకి రాకుంటే.. అల్ట్రానేషన్ గా రోజాపై కొందరు సినీ గ్లామర్ కలిగిన మహిళలను పోటీలో దించేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు పవన్ సైతం రోజా విషయంలో ఉమ్మడి వ్యూహం అనుసరించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇలా ఎటుచూసినా మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో చుక్కలు ఎదురయ్యే పరిస్థితులు మాత్రం తప్పేలా లేవు.