RRR In Hollywood: ఇండియన్ హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల నుంచిసంచలనాలు సృష్టిస్తోంది. ఆల్ టైం ది బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ లో ఉత్తమ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు మన ట్రిపుల్ ఆర్ కు దక్కింది. ఉత్తమ అంతర్జాతీయ విభాగంలో ఆర్ఆర్ఆర్ ఈ అవార్డును సొంతం చేసుకోనుంది. అవార్డు వచ్చిన సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి జ్యూరీకి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ సంతోషాన్ని పంచుకునేందుకు తాను ఇక్కడ లేనని, ఇదే మూవీ రిలీజ్ కోసం జపాన్ లో ఉన్నామని ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

భారత స్వాతంత్ర్య పోరాటంపై అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో తెలుగు పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీంల కథతో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కింది. అల్లూరి సీతారామారాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వారి పాత్ర గురించి ఈ హీరోలు తమ నటనతో నేటి ప్రేక్షకులకు తెలియజేశారు. ఇప్పటి వారికి నచ్చే విధంగా కాస్త విజువల్ ఎఫెక్ట్స్ జోడించారు. ఇందులో తెలుగు నటులతో పాటు బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్ గన్, కోలీవుడ్ నుంచి సముద్రఖని, తదితరులు నటించారు.
పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా ఓవరాల్ గా రూ.1000 కోట్ల వసూళ్లు చేసింది. దీంతో ఈ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు జక్కన్నతో సహా హీరోలు రామ్ చరణ్, తారక్ వెళ్లారు. అక్కడికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే రిలీజ్ చేశారు. అక్కడా ఇదే ఊపుతో సినిమా కలెక్షన్లు ప్రారంభమయ్యాయని అంటున్నారు. దీంతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ కు శాటర్న్ అవార్డు దక్కడంతో మరింత సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఓ మెసేజ్ పెట్టారు. ‘ బాహుబలి-2’ తరువాత నాకు ఇది రెండో అవార్డు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. అయితే అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనాలని ఉంది. కానీ ట్రిపుల్ ఆర్ మూవీని జపాన్ లో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ వివిధ కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తోంది. అందువల్ల అవార్డు తీసుకోవడానికి రాలేకపోతున్నాను. ఇతర అవార్డులందుకున్న వారందరికీ నా అభినందనలు’ అని రాజమౌళి పేర్కొన్నారు.