
CM Stalin Family: ఒక ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ స్కామ్ లో దొరికిపోతుంది. ఆయన కొడుకు ముఖ్యమైన మంత్రిగా చలామణి అవుతాడు. నిషేధిత ప్రాంతంలో ఫామ్ హౌస్ కడతాడు. ఇవే కాదు మన పొరుగున కూడా మంచి మంచి “పరివార” కథలే ఉన్నాయి. ముఖ్యమంత్రుల కుటుంబాలు దర్జాగా దోచుకుంటాయి. ₹వేల కోట్లు సంపాదిస్తాయి. నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ మినహా మిగతా వారందరూ దాదాపు ఆ తానులో ముక్కలే.
మన పొరుగున తమిళనాడు అనే ఒక రాష్ట్రం ఉంది కదా.. మధ్య మన కేసీఆర్ పోయి గట్టిగా ఆలింగనం చేసుకొని, శాలువా కూడా కప్పి వచ్చాడు. ఎస్…ఆ తమిళనాడు ముఖ్యమంత్రి పేరు స్టాలిన్.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయాడు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే అతడి కొడుకు, అల్లుడు 30 వేల కోట్లు నొక్కేశారని ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా పెద్ద సంచలనం.. దీన్ని బయట పెట్టింది తమిళ నాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై. అది కూడా స్టాలిన్ అల్లుడు ఒక ప్రైవేట్ పార్టీలో అన్న మాటలను అన్నామలై సోషల్ మీడియాలో బయట పెట్టేశాడు. దాన్ని ఇప్పుడు కడుక్కోలేక స్టాలిన్ కింద మీదా పడుతున్నాడు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై డిఎంకె, అన్నా డీఎంకే పార్టీలలో అవినీతిపరులైన నాయకుల ఆస్తులను, సంపాదనను వరుసగా బయటకి చెప్తున్నాడు. తమిళనాడు వ్యాప్తంగా ఇవి సంచలనం రేకెత్తిస్తున్నాయి. అన్నామలైకి ముకుతాడు వేసేందుకు డీఎంకే ఈ ఏకంగా 500 కోట్లకి పరువు నష్టం దావా కూడా వేసినట్టు వార్తలు వస్తున్నాయి.. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపించేది కేవలం ఒక ఏడాదిలో స్టాలిన్ అల్లుడు శబరీశన్, కొడుకు ఉదయనిధి 30 వేల కోట్లు సంపాదించారట.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పి.టి.ఆర్ త్యాగరాజన్. ఈ సంపాదన గురించి ఎవరితోనో మాట్లాడుతుండగా ఆ వాయిస్ రికార్డ్ అయింది. అది కాస్తా అన్నామలై దగ్గరకు వచ్చింది. దీంతో అతడు డిఎంకె ఫైల్స్ పేరుతో ఆ ఆడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
సొంత పార్టీ నేత, అందులోనూ ఆర్థిక శాఖ మంత్రి అలా మాట్లాడటం స్టాలిన్ కు మింగుడు పడకుండా మారింది. కానీ స్టాలిన్ ఒక్క మాట కూడా దీని గురించి మాట్లాడటం లేదు. ఈ శబరీషన్ ఎవరో కాదు.. స్టాలిన్ కూతురు సెంథామరై భర్త. శబరీషన్, సెంథామరై ది వివాహం. అయితే సెంథామరైకి చెన్నైలో ఒక స్కూల్ ఉండేది. శబరీషన్ మొదట్లో ఆ స్కూల్ నిర్వహణ చూసుకునేవాడు. తర్వాత మామకు దగ్గరయ్యాడు.. అనివార్యంగా తన మీద ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చాడు.. అంతేకాదు వ్యక్తిగతంగా శబరీషన్ కలుపుగోలు వ్యక్తి. అన్నా డీఎంకే, జనతా పార్టీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సత్సంబంధాలు నెరిపేవాడు. ఎన్నికల సమయంలో ఉదయనిది స్టాలిన్ అవసరం లేకుండానే స్టాలిన్ కు అన్ని తానయ్యాడు. ఎన్నికల మేనేజ్మెంట్, ప్రచారం.. ఇలా ఒక్కటేమిటి అన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించాడు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా తన పోరాటం విరమించలేదు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత త్యాగరాజన్ ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు..
త్యాగరాజన్ కూడా తక్కువ వాడేమి కాదు. ఆయన కూడా దర్జాగా వెనకేశాడు. ఒకానొక సందర్భంలో స్టాలిన్ కొడుకు, అల్లుడు 30 వేల కోట్ల దాకా నొక్కేశారని మాట తూలాడు.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అయితే తన పేరుతో వైరల్ అవుతున్న ఆడియో కల్పితం అని ట్వీట్ చేశాడు. అయితే ఆడియో క్లిప్ నిజంగా.. ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా నిగ్గు తేలిస్తే ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దాన్ని కడుక్కోవాల్సి ఉంటుంది. ఆ క్లిప్ లో మాటలు ఆర్థిక శాఖ మంత్రివే కాబట్టి దానిని తెలివిగా డైవర్ట్ చేసేందుకు ట్వీట్ చేశాడు అంటున్నారు బీజేపీ నాయకులు. ఆర్థిక శాఖ మంత్రి వెనుకంజ వేశాడు అంటే క్లిప్ లో మాటలు తనవే అని ఒప్పుకున్నాడని బిజెపి నాయకులు అంటున్నారు. ఈ ఆడియో క్లిప్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తను మామూలు వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్. ఫేక్ ఆడియో షేర్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో అతడికి తెలుసు. ఈ ఆడియో క్లిప్ షేర్ చేయడంపై డీఎంకే పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. అయినా ఏ కుటుంబ పార్టీ చూసినా ఇవే అవినీతి కంపు కథలు కదా! పైగా సొంత మీడియా ఉండడంతో ఉల్టా దబాయింపు ఒకటి. కెసిఆర్ నుంచి స్టాలిన్ దాకా ఇవే వ్యవహారాలు.. పైగా వీరు దేశాన్ని ఉద్ధరిస్తారట?!