CM Jagan- Early Elections: ఏపీలో అధికార పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందా? అది రోజురోజుకూ తీవ్రమవుతోందా? విపక్షాలు బలం పెంచుకుంటున్నాయా? ఇలానే కొనసాగితే అధికార పార్టీకి చావుదెబ్బ ఖాయడమా? నిఘా వర్గాలు ఇదే హెచ్చరించాయా? జగన్ సర్కారుకు అనుకూలమైన ఓ నేషనల్ మీడియా ఇదే హెచ్చరించిందా? అటు ఐ ప్యాక్ టీమ్ సైతం దానిని ధ్రువీకరించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ తో పాటు అధికార పార్టీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే ఈ అనుమానాలు నిజమేనన్నట్టు తేలుతోంది. ఇటీవల జగన్ సర్కారు చేయించిన సర్వేలన్నీ ప్రతికూల ఫలితాలనే వెల్లడించాయని ప్రచారం సాగుతోంది. విపక్షాలను విడివిడిగా చూపెట్టి చేసిన ఈ సర్వేలెక్కల్లో అధికార పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గగా.. విపక్షాలు క్రమేపీ పెంచుకుంటూ వస్తున్నాయి. అదే పొత్తులు ఉంటే ప్రభుత్వం మునిగిపోవడం ఖాయమన్న సంకేతాలు జగన్ ను కలవర పెడుతున్నాయి.

జగన్ కు నమ్మకమైన, విశ్వాసమైన జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఆరు నెలల కిందట ఏపీలో ఒక సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఏడు స్థానాలు వస్తాయని లెక్క కట్టింది. అదే విషయాన్ని జగన్ కు చేరవేశారు. ఇప్పుడు అదే సంస్థ తాజాగా చేసిన సర్వేలో టీడీపీకి పది ఎంపీ సీట్లు వస్తాయని తేల్చిచెప్పింది. అంటే తనకిష్టమైన నేషనల్ మీడియా తన ప్రత్యర్థికి అన్నిస్థానాలు కట్టబెట్టిందంటే పరిస్థితి జగన్ కు అర్ధమైనట్టుంది. మరోవైపు ఐ ప్యాక్ టీమ్ తాజా, మాజీ మంత్రులు సైతం ఎదురీదుతున్నారన్న వార్త జగన్ చెవిలో పడేసింది. దీంతో జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏం చేయాలో పాలుపోక,.. తన జేబులో ఉన్న ముందస్తు ఎన్నికల అస్త్రాన్ని బయటకు తీసినట్టు టాక్ వినిపిస్తోంది.
అయితే చాలా సందర్భాల్లో జగన్ ముందస్తు ఆలోచన చేశారు. కానీ ఎందుకో వెనుకడుగు వేశారు. కానీ ఈసారి ముందడుగు వేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. షెడ్యూల్ ప్రకారం మరో ఏడాది వరకూ ఎన్నికలకు ఆగితే మాత్రం ఓటమి ఖాయమని నిఘా వర్గాలు, అనుకూలమైన మీడియా వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆ లెక్క పొత్తులు లేకుండా చెప్పినవి. అదే పొత్తు కుదిరితే మాత్రం చుక్కలు కనిపించే చాన్స్ ఉన్నట్టు సదరు సంస్థలు సీఎం జగన్ ను హెచ్చరించాయట.

ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. కొద్దిరోజుల్లో పవన్ బస్సు యాత్ర రోడ్డెక్కనుంది. పొత్తులపై ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. కానీ అధికారికంగా కుదుర్చుకోలేదు. ఎన్నికలకు వ్యవధి ఉండడంతో అప్పటి పరిస్థితి బట్టి ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షాలకు చాన్సిస్తే మాత్రం ఘోర ఓటమి తప్పదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అందుకే ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా ముందస్తుకు వెళ్లడమే ఉత్తమమని సూచిస్తున్నాయి. అటు జగన్ ఢిల్లీ షడన్ టూర్ అందులో భాగమేనని.. ఇప్పటికే కేంద్ర పెద్దల అనుమతి తీసుకున్న జగన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో ప్రారంభమైంది.