Homeఆంధ్రప్రదేశ్‌YCP- Caste Politics: బెడిసికొట్టిన వైసీపీ కుల రాజకీయం

YCP- Caste Politics: బెడిసికొట్టిన వైసీపీ కుల రాజకీయం

YCP- Caste Politics
YCP- Caste Politics

YCP- Caste Politics: ఒక ఓటమి ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుందంటారు. లోపాలను గుర్తుచేస్తుందంటారు. కనువిప్పు కలిగిస్తుందంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అటువంటి ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంటోంది. తనకు తిరుగులేదన్న ధీమా నుంచి జాగ్రత్త పడకుంటే ముప్పే అన్న సంకేతం రావడంతో సీఎం జగన్ మేల్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క సంక్షేమమే తనను గట్టెక్కించదని.. తన విజయానికి, ఓటమికి చాలా రకాల కారణాలు ఉంటాయని గుర్తెరిగారు. తాను ఇచ్చిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన జగన్ ఇప్పుడు దూరమైన వర్గాలను దరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే వైసీపీ నేతలు కొత్త స్లోగన్ అందుకున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నా.. వాటిని సరిదిద్దుకోవడానికి తమ వద్ద సమయం ఉందని చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. ముఖ్యంగా కొన్ని సామాజికవర్గాలతో ఉన్న అగాధాన్ని తగ్గించుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా కొనసీమ జిల్లాకు చెందిన కాపు, శెట్టిబలిజ నాయకులతో సమావేశమయ్యారు. మొన్నటి అల్లర్లలో నమోదైన కేసులను ఉప సంహరించుకున్నట్టు ప్రకటించారు.

కోనసీమ నేతలతో జగన్ భేటీ..
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టారు. జిల్లాల పునర్విభజన సమయంలో కాకుండా.. కొద్ది నెలల తరువాత కొత్త ప్రతిపాదనలు తెచ్చారు. అయితే కోనసీమలో మెజార్టీ వర్గాలుగా ఉన్న కాపులు, శెట్టిబలిజలు, క్షత్రియులకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా అంబేడ్కర్ పేరు తెరపైకి తెచ్చారని.. కులాల మధ్య కుంపట్లు రగిల్చేందుకే వైసీపీ సర్కారు ఈ వికృత క్రీడకు తెరలేపిందన్న టాక్ ప్రారంభమైంది. అయితే వైసీపీ ఒక వ్యూహంతో వెళితే.. అది బెడిసికొట్టి తిరిగి జగన్ సర్కారు మూల్యం చెల్లించుకుందన్న టాక్ ఉంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో జగన్ లో అంతర్మథనం ప్రారంభమైంది. అందుకే ప్రధాన సామాజికవర్గం నేతలతో జగన్ సమావేశమయ్యారు. కోనసీమ జిల్లా పేరు మార్పు పై అమలాపురంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. అందరూ ఐక్యంగా జీవనం సాగించాలని పిలుపునిచ్చారు. సామాజికవర్గాల మధ్య సామరస్యాన్ని సాధించి ఐకమత్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

కేసులు ఎత్తివేతతో కొత్త ఎత్తుగడ..
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఇప్పుడు కాపు, శెట్టిబలిజలు, క్షత్రియుల మద్దతు కూడగట్టేందుకు దళితులను చేజేతులా దూరం చేసుకుంటున్నారన్న టాక్ ప్రారంభమైంది. అమలాపరం అల్లర్లలో దాడులు చేశారని చెప్పి వందల మందిపై కేసులు పెట్టారు. ఇలా దాడులకు గురైంది మంత్రి పినిపె విశ్వరూప్‌తో పాటు ఇతర వైసీపీనేతలు. వారి ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే సీఎం జగన్ వారిని కనీసం పరామర్శించలేదు. పినిపే విశ్వరూప్ తర్వాత అనారోగ్యంతో నెలల తరబడి ఆస్పత్రి పాలైనా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదు. కోలుకుని వచ్చిన తర్వాత కూడా ఆయనను పార్టీ పట్టించుకోనట్లే ఉంది. ఇప్పుడు ఆయన ఇళ్లపై దాడులు చేసిన వారి కేసులు ఎత్తి వేయించి వారితో సీఎం సన్మానాలు చేయించుకోవడం దళితుల్లో ఆగ్రహాన్ని నింపుతోంది. తొలుత అల్లర్లు చేయించింది టీడీపీ, జనసేన వారేనని వైసీపీ ప్రచారం చేసింది. చివరకు ఇవి చేసింది వైసీపీతో సన్నిహితంగా ఉన్నవారేనని తేలింది. తొలుత దూకుడుగా వ్యవహరించిన పోలీసులు సైలెంట్ అయిపోవడంతో అసలు విషయం ప్రజలకు అర్ధమైంది. దీంతో ఇక్కడ దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించినా. ఎటువంటి ఫలితం ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

YCP- Caste Politics
JAGAN

అధికార పార్టీ నేతల్లో అంతర్మథనం..
వైసీపీ కులాల మధ్య రాజకీయ కుంపట్లు పెట్టి చలికాచుకోవాలని చూసింది. కాపు, బలిజ, శెట్టి బలిజలు జనసేన వైపు చూస్తున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికతోనే అమలాపురం అల్లర్లు చోటుచేసుకున్నాయన్నది ఒక ప్రచారంగా ఉంది. మెజార్టీ వర్గాల అభిప్రాయం కూడా అదే. దళితులను వైసీపీ వైపు వన్ సైడ్ గా ఉంచుకోవాలని జగన్ సర్కారు భావించింది. ఇప్పుడు అల్లర్లకు పాల్పడ్డారని భావిస్తూ మిగతా వర్గాలపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంది. అంతమాత్రాన వైసీపీని బలిజలు, కాపులు, శెట్టి బలిజలు నమ్ముతారనుకుంటే పొరబడినట్టే. అలాగని తమను కార్నర్ చేసుకొని వైసీపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడను దళితులు గమనిస్తున్నారు. వైసీపీ కుల రాజకీయంతో ఇప్పుడు రెండు వర్గాలు దూరమైన పరిస్థితి. అందుకే కేసుల ఎత్తివేత, సన్మానాల పేరిట జగన్ సర్కారు హడావుడి చేస్తోందన్న టాక్ ఊపందుకుంది. రెండింటికీ చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారిపోయిందని కోనసీమ వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు. ఏదో అనుకుంటే ఏదేదో జరిగిపోయిందని వారు కలవరపాటుకు గురవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular