Anakapalli: ఒక్కొక్కరికి 13 కు మించి సంవత్సరాల వయసు లేదు. అందరివీ పేద కుటుంబాలే. తమలాగే తమ పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వారి తల్లిదండ్రులు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచి చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ విద్యార్థులు దారి తప్పారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో బీరు సీసాలు చేతిలో పట్టుకున్నారు. పైగా బిర్యానీ తినుకుంటూ.. బీర్ తాగుకుంటూ ఎంజాయ్ చేశారు. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో చేశారు అనుకుంటే పొరపాటే.. సాక్షాత్తు ప్రభుత్వ వసతి గృహంలో ఈ తతంగాన్ని నడిపించారు. పైగా ఈ దారుణాన్ని వీడియో తీస్తున్న వ్యక్తిని కొట్టారు. చూస్తుంటే ఆందోళన కలుగుతుంది కదూ.. ఈ దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ వసతి గృహంలో చోటుచేసుకుంది. ఆ విద్యార్థులు చేసుకున్న మందు విందుకు సంబంధించి వీడియో బయటకి రావడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.
చోడవరంలో ప్రభుత్వం వసతి గృహం నిర్వహిస్తోంది. ఇక్కడ పది తరగతుల వరకు విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇక్కడి వసతి గృహాల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో విద్యార్థులను పట్టించుకునే వారే కరువయ్యారు. వార్డెన్ కూడా చుట్టపు చూపుగా వస్తుండటంతో విద్యార్థులు ఆడింది ఆట, పాడింది పాటగా మారుతుంది. ఫలితంగా వారు తప్పుదారి పట్టి వివిధ వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరుతో విద్యార్థులు బీరు, బిర్యానీ ప్యాకెట్లను నేరుగా వసతి గృహంలోకి తెచ్చుకున్నారు. బీరు తాగుతూ, బిర్యానీ తింటూ రచ్చ రచ్చ చేశారు. చదివేది ఏడో తరగతే అయినప్పటికీ పెద్ద వాళ్ల లాగా ప్రవర్తించారు. ఈ వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తిపై దాడి కూడా చేశారు.
వసతిగృహంలోకి విద్యార్థులు బీరు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ నిర్లక్ష్యంగా ఉండటం అతడి పనితీరును చెప్పకనే చెబుతోంది. పైగా ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్యార్ధులు ఆ స్థాయిలో తాగి తందనాలు ఆడుతుంటే వార్డెన్ ఎందుకు పట్టించుకోవడంలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భావి భారత పౌరులు ఇలా మద్యానికి బానిసైతే రేపటి నాడు దేశ భవిష్యత్తు ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన బయటికి రావడంతో.. ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీని ప్రశ్నిస్తోంది.. జగన్ పాలనలో చివరికి విద్యార్థులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తోంది.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పేరిట మందు కొట్టిన 7వ తరగతి విద్యార్థులు
అనకాపల్లి జిల్లా చోడవరం బాలుర వసతి గృహంలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పేరిట మందు కొట్టిన 7వ తరగతి విద్యార్థులు.
వీడియో తీసిన వ్యక్తిపై దాడి చేసిన స్టూడెంట్స్.. పట్టించుకోని హాస్టల్ వార్డెన్.pic.twitter.com/ZeK3nFtBZ2
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2024