Chhattisgarh Farmer: ఆరుగాళం శ్రమించి పంటలు పండించినా రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు సైతం సాగు నష్టాలకు కారణమవుతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లుతున్నాయి. అయితే మేలైన పంటలు, ప్రతికూల పరిస్థితులు తట్టుకునే నూతన వంగడాలు, ఆదునిక వ్యవసాయ పద్ధతులతో చాలా మంది రైతులు రాణిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. అటువంటి అభ్యుదయ యువ రైతే రాజారాం త్రిపాఠి. చత్తీస్ గడ్ కొండగావ్ జిల్లా వాసి. వ్యవసాయాన్ని నమ్ముకొని అద్భుతాలు సృష్టిస్తున్నారు. అందుకే నాలుగుసార్లు జాతీయ ఉత్తమ రైతు అవార్డును సొంతం చేసుకున్నారు.
రాజారాం త్రిపాఠికి కొండగావ్, జగదాల్ పూర్ ప్రాంతంలో వెయ్యి ఎకరాల భూమి ఉంటుంది. ఇంత భూమి ఉంటే ఎవరైనా పరిశ్రమలు పెట్టుకుంటారు. వేరొకరి భాగస్వామ్యంతో కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. కానీ త్రిపాఠి మాత్రం వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. సాగులో ఉన్న సంతృప్తి మరి ఎందులో రాదని.. లక్షల మందికి ఆహారం అందించే అదృష్టం ఒక్క రైతుదేనని బలంగా నమ్ముతాడు. ఆ ఆకాంక్షతోనే సంప్రదాయ పంటలను పక్కనపెట్టి..లాభసాటి సాగుపై దృష్టిపెట్టాడు. సాగుకు ఆధునికతను జోడించి మంచి ఫలితాలు సాధిస్తున్నాడు.
కొండగావ్, జగదాల్ పూర్ జిల్లాల్లో తనకున్న భూముల్లో నల్ల మిరియాలు, దుంపరకమైన పంటలు సాగుచేసి లాభాలు ఆర్జిస్తున్నాడు. విదేశీ సాగు విధానాన్ని తీసుకొచ్చి పంటలు సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన హెలికాప్టర్ కొనేందుకు నిర్ణయించాడు. ఇప్పటివరకూ డ్రోన్ల ద్వారా ఎరువులు, రసాయనాలు పిచికారీ చేసేవాడు. అయితే అంతగా వర్కవుట్ కాకపోవడంతో హెలికాప్టర్ కొనుగోలు చేసి దాని ద్వారా సస్యరక్షణ, ఎరువులు వినియోగించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉండే హెలికాప్టర్ ను రూ.7 కోట్లకు కొనుగోలు చేసేందుకు విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. ఓ భారత రైతు ఇలా సాగు కోసం హెలికాప్టర్ ను కొనుగోలు చేయడం ఇదే ఫస్ట్ టైమ్. రాజారాం పూర్వీకులు సైతం రైతులే. కానీ రాజారాం విద్యాధికుడు.ఎస్ బీఐ లో ఉన్నతాధికారి. కానీ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అభ్యుదయ, ఆదర్శ రైతుగా మారాడు. తన పిల్లలను సైతం రైతులగానే తీర్చుదిద్దుతానని సగర్వంగా చెబుతున్నాడు.