Hyderabad: భాగ్యనగరంలో వందల అడుగులు లోతుకు వెళితే కానీ నీరు దొరకదు. అంతలా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటి కోసం జంట నగర వాసులు ఆపసోపాలు పడుతుంటారు కూడా. అయితే ఓ ప్రాంతంలో బోరు కోసం తవ్వకాలు చేపడితే 40 అడుగుల్లోనే నీరు ఉబికి వచ్చింది. ఒక్కసారిగా నీరుపైకి రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడకి కొద్దిసేపటికే ఉబికే నీరు నిలిచిపోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారికి షాకింగ్ ఇచ్చే విషయం ఒకటి బయటపడింది.
చింతలబస్తి సమీపంలో ఓ సామాజిక భవనానికి ఎంపీ నిధుల నుంచి పవర్ బోరు ఒకటి మంజూరైంది. సామాజిక భవనం పక్కనే బోరు వేసేందుకు వీలు లేకపోవడంతో రోడ్డు చెంతనే తవ్వేందుకు సిద్ధపడ్డారు. సాధారణంగా భూగర్భ జలాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో తెలుసుకునేందుకు కొబ్బరికాయను ప్రయోగిస్తారు. దీంతో అధికారులు అలానే చేశారు. ఓ చోట ఎక్కువ నీరు ఉందని తెలియడంతో అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. అయితే ఇలా తవ్వే క్రమంలో 40 అడుగుల తవ్వకాలు చేపట్టగా.. ఒకేసారి నీరు ఉబికి పైకి వచ్చింది. దీంతో కాసింత ఆశ్చర్యం వేసినా.. అక్కడున్న వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే అక్కడకు కొద్దిసేపటికే వీధుల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బోరు తవ్విన చోట ఉబికే నీరు ఆగిపోయింది. దీంతో అధికారులు ఆరాతీసే ప్రయత్నం చేయగా.. బోరు తవ్వింది పైపులైన్ పై అని తేలింది. అప్పుడెప్పుడో 50 సంవత్సరాల కిందట పైపులైన్ వేశారు. 40 అడుగుల లోతులో ఉందని గ్రహించలేకపోయారు. కొబ్బరికాయ నిర్థారణ చేసిందని అక్కడే తవ్వకాలు చేపట్టారు. పైపులైన్ ను తవ్వేశారు. ఉన్న నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.