
CSK Vs SRH 2023: ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరుకు శుక్రవారం రంగం సిద్ధం అవుతోంది. మాస్టర్ మైండ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. ఈ సీజన్ లో చెన్నై ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు విజయాలు, రెండు ఓటములతో పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్ ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికరమైన పోరాటానికి తెర లేవనుంది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఇది 29వ మ్యాచ్. చెన్నై చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మార్క్రమ్, చెన్నై సూపర్ కింగ్స్ కు ఎంఎస్ ధోని కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
బలంగా కనిపిస్తున్న చెన్నై జట్టు..
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లను బట్టి చూస్తే చెన్నై జట్టు బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఐదేసి చొప్పున మ్యాచ్ ఆడాయి. చెన్నై జట్టు మూడు విజయాలతో మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ జట్టు రెండు విజయాలతో 9వ స్థానంలో ఉంది. బలమైన చెన్నై జట్టును ఎదుర్కోవడానికి సన్ రైజర్స్ కసరత్తు పూర్తి చేసింది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని ఆశిస్తోంది హైదరాబాద్ జట్టు.

హైదరాబాద్ జట్టుకు అత్యంత కీలకం..
చెన్నై తో జరగనున్న ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు అత్యంత కీలకం. తదుపరి దశకు హైదరాబాద్ జట్టు వెళ్లాలంటే చెన్నై తో మ్యాచ్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. హైదరాబాద్ జట్టు బలంగానే ఉన్నప్పటికీ సమష్టి పోరాటం కొరవడుతోంది. దీంతో ఈ జట్టు విజయాలు సాధించలేక చతికిల పడుతోంది. ఇప్పటికైనా సమష్టిగా ఆడితే వరస విజయాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అభిమానులు పేర్కొంటున్నారు. ఒక మ్యాచ్ లో ఇద్దరు ఆడితే.. మరో మ్యాచ్ లో ముగ్గురు ఆడకుండా చేతులు ఎత్తేస్తున్నారని.. దీంతో అపజయాలు పాలు కావాల్సి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కలిసికట్టుగా ఆడితేనే చెన్నై వంటి పటిష్టమైన జట్టుపై విజయం సాధించేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇది జట్టు అంచనా :
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఎన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్/ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, మార్కో జన్సేన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ సహా కెప్టెన్ తదితరులు విజృంభించాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ జట్టు అభిమానులు.
చెన్నై తుది జట్టు అంచనా : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజంక్య రహనే, మొయిన్ అలీ, శివమ్ దుబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ – వికెట్ కీపర్), మతిషా పాతిరణ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే ఆడే అవకాశాలు ఉన్నాయి.