Osmania Medical College: తల్లి , తండ్రి తర్వాత స్థానం గురువుదే. ఈరోజు గొప్ప స్థానంలో ఉన్న వారంతా ఒకప్పుడు గురువులు చెప్పిన పాఠాలు విన్నవారే. వారి చేతిలో బెత్తం దెబ్బలు తిన్నవారే. వారు విధించిన హోంవర్క్ చేసినవారే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తులు పుట్టాయి.. కాలం మారుతున్నా కొద్దీ గురువును గౌరవించే విధానంలో మార్పులు వస్తున్నాయి. వెనుకటి తరంతో పోలిస్తే ఈ తరానికి గురువులంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతోంది అనే విమర్శలు ఉండేవి. అవి నిజం కాదని.. తాము కూడా పాత తరం వారి లాగానే గురువులను గౌరవిస్తున్నామని చేతల్లో చూపించారు ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు. వారు చేసిన పని సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మన దేశానికి 1962 నుంచి 1967 వరకు రెండవ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చేశారు. ఒక గురువుగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆయన.. రాష్ట్రపతి దాకా ఎదిగారు. రాష్ట్రపతి పదవికి సరికొత్త అలంకారాన్ని తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి గురువుగా పనిచేస్తున్నప్పుడు.. ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అయితే ఆయన పదవీ విరమణ చేస్తున్నప్పుడు ఆయన ద్వారా పాఠాలు నేర్చుకున్న విద్యార్థులంతా ఘన సన్మానం చేశారు. ఒక రథంలో ఆయనను కూర్చోబెట్టి, పూలమాలలు వేసి ఆ రధాన్ని తాళ్లతో లాగారు. అప్పట్లో అదొక సంచలనం.. సరిగ్గా ఇన్నాళ్లకు ఆ స్థాయిలో కాకున్నా.. ఉస్మానియా వైద్య విద్యార్థులు తమ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ రెడ్డి కి ఘనమైన వీడ్కోలు పలికారు. ఇన్ని రోజులపాటు వైద్య విద్యలో పాఠాలు బోధించిన ఆమెకు ఘనమైన సత్కారం చేశారు. ఒక గుర్రపు బగ్గిలో ఆమెను కూర్చోబెట్టి కోఠీ మొత్తం తిప్పారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నే తమ వైద్య కళాశాల ఉంది కాబట్టి వారు ఆ పని చేశారు.
తన వద్ద వైద్య పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు అలా గుర్రపు బగ్గిలో కూర్చోబెట్టి తనకు సన్మానం చేయడం పట్ల శశికళ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు పూలు చల్లుతూ ఆమె చేసిన సేవలను కొనియాడుతుండడంతో కన్నీటి పర్యంతమయ్యారు.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఒక్కో విద్యార్థి ఒక్కో తీరుగా చెబుతుండడంతో ఉద్వేగానికి గురయ్యారు. కాగా, ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది..గురువును ఈ స్థాయిలో సన్మానించడం గొప్ప విషయమని నెటిజన్లు ఈ వీడియోని చూసి వ్యాఖ్యానిస్తున్నారు.