
Chandrababu: ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వండి. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. పరిస్థితి దిగజారిపోయింది. పాలన గాడి తప్పింది. ముందస్తు తప్ప మరో మార్గం లేదు “. ఇవి ఏపీ ప్రతిపక్ష నేత ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. ఏపీలో పరిస్థితి పై వివరించిన తీరు. ఇంతకీ ఎపీలో ఎప్పుడు ఎన్నికలు జరగనున్నాయి ? ప‌్రతిపక్ష నేత అంత కచ్చితంగా ఎలా అంచనా వేయగలుగుతున్నారు ? ఈ స్టోరీలో విశ్లేషణ చేద్దాం.
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెబుతున్నారు. ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో అనేకసార్లు ముందస్తు ఎన్నికల గురించి హెచ్చరించినా.. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ , మే లేదా నవంబర్, డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. అంత కచ్చితంగా అంచనాకి రావడానికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైంది. కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు. కొత్త అప్పు పుట్టకపోతే రాష్ట్రం ముందుకు నడిచే పరిస్థితి లేదు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు. ఈ నేపథ్యంలో ముందస్తుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నది చంద్రబాబు అంచనా.
ఏ నెలలో ఎన్నికలు జరుగుతాయో కూడా తాను స్పష్టంగా చెబుతున్నానంటే.. ప్రభుత్వం ఎన్నికలకు ఎంత సిద్ధంగా ఉందో అర్థం చేసుకోవాలని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. ముందస్తు ఎన్నికలకు మూడు ప్రధాన కారణాలుగా చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఒకటి వైఎస్ వివేకా హత్య కేసు కాగా.. రెండోది అప్పులు, మూడోది ఆర్థిక పరిస్థితి దిగజారడం. వైఎస్ వివేకా హత్య కేసు కూడా త్వరలో విచారణ పూర్తవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఫలితం వచ్చినా అందుకు వైసీపీ సిద్ధమైందని చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో అప్పులు పెరగడం, ఏపీ ఆర్థిక స్థితి దిగజారడం కూడా ముందస్తు ఎన్నికలకు ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 21 నుంచి పోల్ మేనేజ్మెంట్ పై కీలక సమావేశాలు నిర్వహించనుంది. సీనియర్ నేతలతో ముందస్తు ఎన్నికల అంశం పై చంద్రబాబు చర్చలు జరిపారు. దీనిని బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఇంత సీరియస్ గా సిద్ధమవుతున్నారంటే.. ముందస్తు ఎన్నికల పై స్పష్టమైన సమాచారం ఉన్నట్టు కనిపిస్తోంది. మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులకు అంగీకారం తెలిపితే రెండు నెలల్లోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీని పై చంద్రబాబు కచ్చితమైన అంచనాతో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అంచనా నిజమైతే ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి.