
Chandrababu- Jagan: రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చాలా విషయాల్లో జగన్ చెప్పుకొచ్చే మాటలు ‘దేవుడి దయ’ లేకపోతే ‘కేంద్రం దయ’. విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మెడలు వంచి పనిచేయిస్తామన్న మాట కాస్తా… అధికారంలోకి వచ్చాక దేవుడి దయతలస్తే అన్న మాటగా మారిపోయింది. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా జగన్ అదే మాట చెప్పుకొచ్చారు. నాటి చంద్రబాబు సర్కారు ఐదు శాతం ఈబీసీ కోట కింద రిజర్వేషన్ కల్పిస్తే… అవి ఒక రిజర్వేషన్లేనా అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక కాపులు కోరుకుంటుంది ఐదో, పది ఈబీసీ రిజర్వేషన్లు కాదంటూ చెప్పుకొచ్చారు. వారికి సంపూర్ణ రిజర్వేషన్లు ఇవ్వాలి తప్ప.. ఇలా అరకొర ఇవ్వడం ఏంటని చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లను సైతం దూరం చేశారు. మూడున్నరేళ్లుగా రిజర్వేషన్ ఫలాలను అందకుండా చేశారు అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ముందుగా ఏపీ హైకోర్టుకు తన అభిప్రాయం తప్పకుండా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
కాపుల రిజర్వేషన్ ఉద్యమం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ ఇది. కానీ పార్టీలు ఎన్నికల్లో హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. 2014 ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు హామీతో కాపులు ఆ పార్టీని గెలిపించారు. దీంతో తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలుచేయాల్సిందేనని ముద్రగడ పద్మనాభం పట్టుబట్టారు. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఇవ్వొచ్చు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో చంద్రబాబు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పించారు. దీంతో కాపు రిజర్వేషన్ ఉద్యమం సద్దుమణిగింది. కానీ దాని ఫలితంగా చంద్రబాబు ఎంత మూల్యం చెల్లించుకున్నారో.. జగన్ అంతబాగా వర్కవుట్ చేసుకున్నారు.

తీరా అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల అమలు అనేది తమ చేతుల్లో లేదని.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమంటూ జగన్ దాట వేశారు. అంతటితో ఆగకుండా అప్పటివరకూ చంద్రబాబు సర్కారు కల్పించిన ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్ ను సైతం జగన్ సర్కారు రద్దుచేసింది. అటు కాపులకు సంపూర్ణ రిజర్వేషన్లు దక్కక.. ఇటు ఐదు శాతం ఈబీసీ కోట లేక కాపులు చాలా విధాలుగా నష్టపోయారు. దీనిపై కాపుల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నా జగన్ లో చలనం లేకుండా పోయింది. దీంతో మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య రిజర్వేషన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎనిమిది పదుల వయసులో నిరసన దీక్షకు ఉపక్రమించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోగా.. వృద్ధ నేతతో బలవంతంగా దీక్ష విరమింపజేసింది.
ఈ నేపథ్యంలో హరిరామజోగయ్య రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అటు సంపూర్ణ రిజర్వేషన్లు కల్పించకపోగా.. గత ప్రభుత్వం అందిస్తున్న ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లను సైతం జగన్ సర్కారు నిలపివేసిందంటూ పిటీషన్లు దాఖలు చేశారు. ఇవి విచారణకు రావడంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఈ బంతి జగన్ కోర్టులోకి చేరింది. ఇప్పుడు కోర్టుకు జగన్ ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ పిటీషన్ విచారణకు అర్హత కాదని చెబితే కాపులు శాశ్వతంగా దూరమవుతారు. లేదు విచారణ చేపట్టాలని చెబితే మిగతా వెనుకబడిన వర్గాల వారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. అసలే ఎన్నికల వేళ.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం జగన్ మెడకు చుట్టుకుంది.