
Chandrababu And Pawan Kalyan- Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే జగన్‌లో టెన్షన్ మొదలైందా..? అంతర్గత సర్వేలు ఆయనను భయపెడుతున్నాయా? అందుకే ఆయన మాటలు తడబడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది ఆంధ్రా పొలిటికల్ సర్కిల్స్ నుంచి. ఇన్నాళ్లూ‘ వైనాట్ 175 ’ అంటూ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు సూచించిన జగన్, విపక్షాలన్నీ కలిసి పోటీ చేసినా గెలవరని ధీమా వ్యక్తం చేశారు. కానీ సడెన్‌గా ఆయన స్వరం మారింది. ఇన్నాళ్లూ పొత్తు పెట్టుకుని పోటీ చేయండి అన్న జగనే ఇప్పుడు టీడీపీ, జనసేనకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని సవాల్ చేస్తున్నారు.
మళ్లీ విభజన రాజకీయం..
విభజన రాజకీయాలు జగన్‌కు కొత్త కాదు. తాను అధికారంలోకి రావడం కోసం ఆయన దేనికైనా తెగిస్తాడు. తల్లయినా… చెల్లయినా.. బాబాయ్ అయినా ఎవరినీ లెక్కచేయడు. జగన్‌కు సెంటిమెంట్లు కూడా ఉండవు. తాజాగా ఏపీలో అధికార పార్టీని ఓడించేందుకు ఏకమవుతుండగా, వాటిని విభజించాలని జగన్ కొత్త రాగం అందుకున్నారు. ఇన్నాళ్లూ పందులే గుంపుగా వస్తాయన్న జగన్ ఇప్పుడు సింగిల్‌గా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అని టీడీపీ, జనసేనకు సవాల్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
విపక్షాల పోటీ జగనే నిర్ణయిస్తారా?
అసలు విపక్షాలు ఎలా పోటీ చేస్తాయన్నది.. వారిష్టం. ఎలా పోటీ చేయాలో వారే తేల్చుకుంటారు. అది వారి రాజకీయం. కానీ సీఎం జగన్ మాత్రం విపక్షాలకు కూడా తానే దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకప్పుడు పైసా పెట్టుబడి పెట్టకుండా షేర్లు అమ్మి.. వేల కోట్లు పోగేసి పెట్టిన సాక్షి పత్రికను రూ.2 అమ్మి.. మిగతా పత్రికలు కూడా రెండుకే ఇవ్వాలని సవాల్ చేసినట్లుగా ఇప్పుడు.. తాము ఒంటరిగా పోటీ చేస్తాం.. మీరు కూడా ఒంటరిగా పోటీ చేయాలన్న వాదన తీసుకు వస్తున్నారు.
వాళ్లు కలిస్తే ఓటమన్న భయం..
విపక్షాలు కలిస్తే ఓడిపోతామన్న భయంలో జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. మాట తీరు కూడా మారింది. అందుకే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ, జనసేనను విడగొట్టాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. విపక్షాలను బేలగా సవాల్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన కలిస్తే దారుణమైన పరాజయం ఎదురొస్తుందన్న అభిప్రాయాలు రోజురోజుకు బలంగా వినిపిస్తున్నాయి. సర్వే రిపోర్టుల్లోనూ అదే వెల్లడవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్.. ఎలాగైనా జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేసేలా చూడాలనుకుంటున్నారు.

బెడిసి కొడుతున్న ఎత్తుతలు..
ఇప్పటికే పొరుగు రాష్ట్ర ఆత్మీయ రాజకీయ నేతతో కలిసి ఆయన చేస్తున్న రాజకీయం.. పవన్‌ను ఒంటరిగా పోటీ చేయించేందుకు వేస్తున్న ఎత్తుగడలు.. జనసేన ఓటు బ్యాంకును చీల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సఫలం కావడం లేదు. చంద్రబాబు, పవన్ కలిసేలా చేసింది జగనే .. వైసీపీ నేతలతో పవన్ కల్యాణ్‌ను బండ బూతులు తిట్టించారు. పోటీసులదో దాడులు చేయించాడు. నిర్బంధం చేయించారు. టీడీపీ, జనసేన కలవకపోతే.. రాష్ట్రం బాగుపడదనే పరిస్థితికి తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్లు కలిసే పరిస్థితి రావడంతో ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు చేస్తున్నారు.
మొత్తంగా ఏపీ సీఎంకు ఎన్నికలకు ఏడాది ముందే భవిష్యత్ కనబడినట్లు ఉంది. అందుకే విభజన రాజకీయాలు షురూ చేశారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.