https://oktelugu.com/

Maharashtra : రౌండ్ చేసి.. కసి తీరా పొడిచి.. పులిని చంపిన గేదెలు.. వీడియో వైరల్‌! 

పులి పంజా విసిరేందుకు యత్నించగా. గేదెలు తమ పదునైన కొమ్ములతో పులిని ఎత్తిపడేశాయి. తర్వాత కసితీరా పొడిచాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పులి.. కాసేపటికి మృతిచెందింది. అక్కడే ఉన్న పశువుల కాపరులు పులి గేదెల యుద్ధాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2023 / 09:26 AM IST
    Follow us on

    Maharashtra : పులి.. పేరు వినగానే భయం.. దూరంగా కనిపిస్తేనే ఒంట్లో వణుకు.. ఇక దాడిచేసేందుకు వస్తే.. పై ప్రాణాలు పైనుంచే పోతాయి. మనిషికే కాదు.. ఏ జంతువైనా అంతే. ఆయుధాలు ఉన్నా.. జనం చుట్టూ ఉన్నా.. పులి వస్తే చెల్లాచెదురై పోవాల్సిందే. దాని పంజాకు చిక్కితే నూకలు చెల్లినట్లే.. కానీ మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాడి చేసేందుకు వచ్చిన పులిని ఐక్యంగా అడ్డుకుంది గేదెల గుంపు. అంతే కాకుండా పులిని చుట్టుముట్టి.. కొమ్ములతో కసితీరా పొడిచి చంపాయి. పులిని ఎదుర్కొన్న గేదెల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    ఆకలి తీచ్చుకునేందుకు..
    పులి తన మనుగడ కోసం.. ఆకలి తీర్చుకునేందకు గేదెలు, ఆవులపై దాడి చేయడం సాధారణమే. కానీ గేదెలు పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపడం సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా మూల్‌ తాలూకాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో కొంతకాలంగా పులి సంచరిస్తోంది. కంటికి కనిపించిన జంతువులపై దాడిచేసి చంపి తింటోంది. పశువులను మేపేందుకు వెళ్తున్న వారిపైనా దాడులు చేస్తోంది. దీంతో ప్రజలు, పశువుల కాపరులు భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. పులి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పశువులను మేపేందుక వెళ్లేవారైతే వణికిపోతున్నారు.
    ఆకలిలో ఆహారం కోసం వచ్చి..
    ఈనెల 20న ఎస్‌గావ్‌ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై దాడికి ప్రయత్నించింది పులి. అయితే.. అతను తన చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు దాడి చేయడంతో పులి వెనక్కి తగ్గింది. అలా పశువుల కాపారి ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే ఆకలితో ఉన్న పులి తర్వాత బెంబాడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెల మంద దగ్గరకు వెళ్లింది. ఆహారం దొరికింది కదా అనుకుని దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది.
    ఐక్యంగా ఎదురుదాడి..
    ఈ క్రమంలో గేదెలు భయపడి పరిగెత్తి చెల్లాచెదురవ్వలేదు. ఐక్యంగా పులిని ఎదురించాలనుకున్నాయి. పులి దాడిని ఎదుర్కొనేందుకు ఏకమయ్యాయి. తమపై దాడికి వచ్చిన పులినే చుట్టుముట్టాయి. శత్రువు దగ్గరకు నెమ్మదిగా కదిలాయి. ఈ క్రమంలో పులి పంజా విసిరేందుకు యత్నించగా. గేదెలు తమ పదునైన కొమ్ములతో పులిని ఎత్తిపడేశాయి. తర్వాత కసితీరా పొడిచాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పులి.. కాసేపటికి మృతిచెందింది. అక్కడే ఉన్న పశువుల కాపరులు పులి గేదెల యుద్ధాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఐక్యంగా ఉంటే.. శత్రువు ఎంత బలవంతుడైనా.. ఎదుర్కొవచ్చని కామెంట్స్‌ పెడుతున్నారు.