https://oktelugu.com/

Kachidi Fish : పులస కాదు గాని.. అంతకు మించిన డిమాండ్‌

ఆంధ్రాలో పులసకు భారీ ధర పలుకుతుంది. ప్రస్తుతం పులసకు డిమాండ్‌ ఉన్నప్పటికీ దాన్ని బీట్‌ చేసింది కచ్చిడి చేప. కాకినాడ కుంభాభిషేకం రేవులో చేప మత్స్యకారుల వలలో పడింది. దీన్ని వేలం వేయగా ఓ వ్యాపారి రూ.3.30 లక్షలకు కొనుగోలు చేశాడు.

Written By:
  • Rocky
  • , Updated On : July 23, 2023 9:14 am
    Follow us on

    Kachidi Fish: దాని కోసం పుస్తెలు కూడా అమ్ముకుంటారని ఓ నానుడి. మాంచిగా వానలు కురుస్తుంటే.. గోదావరికి ఎదురెక్కిన చేపలను పట్టుకుని(అన్నీ అవే కావు) చింతపండు పులుసు, మాగాయ కారం వేసుకుని తింటే ఉంటది.. ‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా’ అని పాడాలి అన్పిస్తుంది. పులస గురించి ప్రస్తావన వస్తే సీమాంధ్ర వాసులు ముఖ్యంగా కోస్తా వాసులు ఇలాగే మాట్లాడుతుంటారు. పులస గురించి వర్ణించుకుంటూ నోట్లో లాలాజలాన్ని లీటర్ల కొద్దీ ఊరిస్తుంటారు. ఏటా వానాకాలంలో అది కూడా వర్షాలు ప్రారంభమయ్యే సీజన్‌లో మాత్రమే పులస దొరుకుతుంది. కానీ ఈ పులస సీజన్‌లో మరో చేప కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.. అంతే కాదు ఏకంగా రూ. మూడు లక్షలకు పైగా రేటు పలికింది. ఇంతకీ ఆ చేపకు ఎందుకంత రేటంటే..

    ఇది కచ్చడి చేప

    చేపల్లో చాలా రకాల ఉంటాయి. ప్రపంచంలో ట్యూనా చేపకు అత్యధిక రేటు ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో పులసకు భారీ ధర పలుకుతుంది. ప్రస్తుతం పులసకు డిమాండ్‌ ఉన్నప్పటికీ దాన్ని బీట్‌ చేసింది కచ్చిడి చేప. కాకినాడ కుంభాభిషేకం రేవులో చేప మత్స్యకారుల వలలో పడింది. దీన్ని వేలం వేయగా అక్కడి వ్యాపారులు పోటీ పడ్డారు. హోరాహోరీగా వేలం పాడారు. చివరికి ఓ వ్యాపారి దీనిని రూ.3.30 లక్షలకు కొనుగోలు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ చేప గురించి చర్చ మొదలయింది. 25 కిలోల బరువు ఉన్న ఈ చేపకు అంత డిమాండ్‌ ఎందుకనే ఆసక్తి పెరిగింది.

    అనేక ఔషధ విలువలు

    సాధారణంగా చేపలు తింటే కంటికి మంచివని వైద్యులు చెబుతుంటారు. ట్యూనా లాంటి చేపలయితే క్యాన్సర్‌, ఇతర హృద్రోగాలను నివారిస్తాయని వైద్యులు అంటుంటారు. అయితే పులస లాంటి చేపల రుచి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్‌లో కొంతమంది కాంట్రాక్టర్లు పులస చేపలను ఇచ్చి ఉన్నతాధికారులతో పనులు చేయించుకు నే వారంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ కచ్చడి చేప అనేది చాలా విలువైన ఔషధ విలువల కలది అని మత్స్యకారులు అంటారు. ముఖ్యంగా ఇది నదిలో నుంచి సముద్రంలోకి వెళ్లి అక్కడ అరుదైన నాచును తింటుంది. దాని వల్ల దాని గ్లాడర్‌(పిత్తాశయం) ఔషధమయంగా మారుతుంది. ఇది తింటే పిత్తాశయం, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు తగ్గుతాయని వైద్యులు చెబుతుంటారు. అందుకే ఈ చేపకు డిమాండ్‌ ఉంటుంది. కాగా ఇక్కడ లభించే కచ్చడి చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. కుంభాభిషేకం రేవులో మత్స్యకారులు వీటిని వేటాడేందుకు చాలా దూరం ప్రయాణిస్తారు. అవి వలలలో పడితే తమ పంట పండుతుందని భావిస్తారు.