
BRS MLA Chinnaiah : ప్రైవేటు డెయిరీ విస్తరణకు సాయమందిస్తానని రాత్రికి అమ్మాయిల్ని పంపించమన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య వ్యవహారం రెండు రోజులుగా వివాదాస్పదమవుతోంది. ఆ సంస్థలో పని చేసే ఓ అమ్మాయిపై కన్నేసి తన కోరిక తీర్చాలంటూ వెంటబడ్డారు. తమ వ్యాపార విస్తరణ కోసం ఆ డెయిరీ నిర్వాహకుడు ఓ అడుగు ముందుకేసి తన సంస్థలో పని చేసేవారితో కాకుండా వేరే వాళ్లతో ఆ ప్రజాప్రతినిధి సరదా తీర్చారు. హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులకు కేటాయించిన క్వార్టర్‌కే పంపించి తన కోరికను తీర్చాడు.
అసైన్డ్ భూమి, ఐదు శాతం వాటా
ప్రైవేటు డెయిరీ విస్తరణ కోసం గత ఏడాది నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని తన నియోజకవర్గంలోనే ఆ కంపెనీ ఏర్పాటు చేయాలని, సాయం చేస్తానని చెప్పారు. ఆ కంపెనీ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండెకరాల అసైన్డ్ భూమిని డెయిరీ కోసం అప్పగించారు. లావుని పట్టా భూమిని అమ్మినట్లుగా బేరం కుదుర్చుకున్నాడు. డెయిరీ ప్లాంటు, పాల నిల్వ కోసం శీతల గిడ్డంగి, ప్యాకింగ్ కేంద్రం నిర్మించాలని ప్రణాళిక వేశారు. నిర్మాణం మొదలయ్యే ముందే ఆ ప్రజాప్రతినిధి తన సమీప బంధువు పేరుతో ఐదు శాతం వాటా సైతం తీసుకున్నారు. డబ్బుల విషయంలో గొడవలు తలెత్తి, వివాదాలు బయటకు వస్తున్నాయి.
ట్యాబ్లెట్లు కావాలంటూ వాట్సాప్ చాటింగ్
పలుమార్లు సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగి వచ్చి చిన్నయ‍్యతో మాట్లాడిన సందర్భంలో ఓ అమ్మాయిపై మనసు పడ్డాడు. ఆమెను ఓ నైట్ కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. సోమవారం ఓ ఆడియో రికార్డు సైతం వాట్సాప్ గ్రూప్‌లో మీడియాకు వచ్చింది. తమ సిబ్బందితో కాకుండా వేరే వాళ్లను ఆరేంజ్ చేసి ఆ ప్రజాప్రతినిధి కోరిక తీర్చినట్లుగా ఆడియోలో ఉంది. వీటికి సంబంధించి చిన్నయ్య, డెయిరీ నిర్హాకుడు జరిపిన వాట్సాప్ సంభాషణ హైదరాబాద్‌లో తాను చేసిన ‘ఎంజాయ్’పైనా మెస్సేజ్‌లు ఉన్నాయి. ‘‘ట్యాబ్లెట్లు కావాలి. రిలాక్సేషన్ పొందాలి. ఆ అమ్మాయి వస్తుందా..?’’ అంటూ సాగిన సంభాషణలు జిల్లాలో వైరల్‌గా మారాయి.
దళితబంధులో రూ.కోట్లు కొట్టేసేలా..
జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండో విడతలో తన నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధితో దళితబంధులో 200 పాడి యూనిట్లు ఇప్పిస్తే రూ.2 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. మరో నియోజకవర్గంలో ఓ యువ నాయకుడితో కూడా యూనిట్లు ఇప్పించేలా చర్చించారు. ఓ ప్రజాప్రతినిధి తనకు ‘గేదెలు ఇస్తే ఏం చేసుకోవాలి. ట్రాక్టర్లు ఇస్తే ఉపయోగపడుతాయి’ అని అంటే ఆ మేరకు సంప్రదింపులు జరిపారు. ఈలోపే ‘రిలేషన్’ చెడిపోవడం, రెండో విడత యూనిట్లు మంజూరు కాక ప్రణాళిక ముందుకు కదల్లేదు. ఆ చైర్మన్ మాత్రం డబ్బులు తీసుకుని గేదెలు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చి బౌన్స్ చేసి కేసులతోనూ వివాదం మరింత ముదిరింది. మరోవైపు ఆ కంపెనీపై ఆంధ్రా, వరంగల్ ప్రాంతంలో డెయిరీ నిర్వాహకులపై పలు కేసులు ఉన్నాయి. గతంలో రైతులకు పశువుల బీమాపై చెక్ బౌన్స్ అయి వివాదాలు, ఇతరత్రా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
సంబంధం లేదంటున్న ఎమ్మెల్యే..
తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ప్రచారం అవుతున్న ఫోన్ నంబర్ తనది కాదే కాదని పేర్కొన్నారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
‘రైతులకు ఉచిత ఫాంలు, లోన్లు ఇస్తామని కొంతమంది నా దగ్గరకు వచ్చారు. రైతులకు లాభం చేకూరుస్తారని నమ్మి వారిని ప్రోత్సహించా. కానీ వారు నాకు తెలియకుండా లోన్లు ఇప్పిస్తామని చెప్పి 20-25 మంది రైతుల నుంచి సుమారు రూ.60-70 లక్షలు వసూలు చేశారు. డబ్బులు కట్టించుకొని మోసం చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం రైతులు నా దృష్టికి తీసుకువస్తే.. నేను వెంటనే పోలీసులకు చెప్పాను. వాళ్లు పిలిచి విచారిస్తే లోన్లు ఇప్పిస్తామని చెప్పినవారు భారీ మోసానికి పాల్పడినట్లు తెలిసింది. చాలా ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వారు ఇలాగే మోసానికి పాల్పడినట్లు తేలింది. వారిపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో తెలుసుకుని రైతులు ఇచ్చిన పిటిషన్ ప్రకారం చీటింగ్ కేసు పెట్టి నిందితులను జైలుకు పంపాం. అది దృష్టిలో పెట్టుకుని నన్ను ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో వారు బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో కన్పిస్తున్న నంబర్లు నావి కావు. కావాలనే నన్ను ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని ఇలా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నా.’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.