Maganti Gopinath Passes Away: హైదరాబాదులోని హైదర్ గూడ ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ జన్మించారు. ఆయన వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఆయనకు భార్య సునీత, కుమార్తె నాగ దిశిర, కుమారుడు వాత్సల్య నాథ్ ఉన్నారు. ఈయన తల్లిదండ్రుల పేరు కృష్ణమూర్తి, మహానందకుమారి. 2014లో ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున జూబిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. గోపీనాథ్ రాజకీయ రంగ ప్రవేశం 42 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985 నుంచి దాదాపు ఏడు సంవత్సరాలు ఆయన తెలుగు యువత స్టేట్ ప్రెసిడెంట్ గా పని చేశారు. 1987, 1988లో హుడా డైరెక్టర్ గా కొనసాగారు.. 1988 నుంచి 1993 వరకు కన్స్యూమర్ ఫోరం ప్రెసిడెంట్గా, తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా పని చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలలో పనిచేశారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నేపథ్యంలో 2014లో తెలుగుదేశం పార్టీ ఆయనకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. తన సమీప ప్రత్యర్థి.. ఎంఐఎం పార్టీ నాయకుడు నవీన్ యాదవ్ పై దాదాపు పదివేల ఓట్ల లోపం మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి మీద 16 వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
ఇక 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కెసిఆర్ ఆయనను పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ మెంబర్ గా అన్యమించారు.. ఇక 2023 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీచినప్పటికీ.. మాగంటి గోపీనాథ్ తట్టుకోని నిలబడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన భారత రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ మధ్య గోపీనాథ్ కాంగ్రెస్లోకి వెళ్తారు అని ప్రచారం జరిగినప్పటికీ.. దాని నేరుగా ఆయనే కొట్టి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు.
ఇటీవల దాకా ఆరోగ్యంగా ఉన్న ఆయన.. తాజాగా అనారోగ్యానికి గురి కావడం.. తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూయడంతో గులాబీ పార్టీలో కలకలం నెలకొంది. హైదరాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన.. హఠాన్మరణం చెందడంతో పార్టీ శ్రేణులు దిగ్బ్రాంతి చెందాయి. గోపినాథ్ కన్నుమూసిన విషయం తెలుసుకున్న హరీష్ రావు, భారత రాష్ట్ర సమితికి చెందిన ఇతర నాయకులు కూడా ఎఐజి ఆసుపత్రికి వెళ్తున్నారు. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కూడా విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే వెంటనే గోపీనాథ్ ను పరామర్శించారు. ఏఐజి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి సానుభూతి ప్రకటించారు.