ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ల ప్రయోగాలకు బ్రేకులు పడుతూ ఉండటం ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ లో ఆరోగ్య సమస్యలు కనబడటంతో కొన్ని రోజుల పాటు క్లినికల్ ట్రయల్స్ కు బ్రేకులు పడ్డాయి.

తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ చివరి దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న సమయంలో ఒక వాలంటీర్ లో ఆరోగ్యపరమైన సమస్యలను కనిపించడంతో వ్యాక్సిన్ ప్రయోగానికి బ్రేకులు పడ్డాయి. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే వాలంటీర్ అనారోగ్యానికి గురయ్యాడా..? లేక అతనికి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా..? తెలియాల్సి ఉంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగానికి బ్రేకులు పడటం ప్రజలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది.
అయితే జాన్సన్ అండ్ జాన్సన్స్ సంస్థ మాత్రం ఏ వ్యాక్సిన్ గురించైనా ప్రయోగాలు చేసే సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సాధారణమేనని వెల్లడించారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం వేల సంఖ్యలో వాలంటీర్లపై ప్రయోగాలు చేసిన సమయంలో కొందరిలో యాదృచ్ఛికంగా అనారోగ్య సమస్యలు కనిపిస్తాయని దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
భారీస్థాయిలో వైద్యపరమైన అధ్యయనాలు చేసే సమయంలో తాత్కాలిక విరామాలు సాధారణమేనని పేర్కొన్నారు. వాలంటీర్లు ఏ అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారో వాటిని కంపెనీలు పరిశోధించాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట్లో పదుల సంఖ్యలో వ్యాక్సిన్ల ప్రయోగాలు ప్రారంభం కాగా వివిధ కారణాల వల్ల ప్రయోగాలు ఆగిపోయాయి. ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్లకు సంబంధించి మాత్రమే తుది దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు ఇదే విధంగా కనిపిస్తే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం పడింది.