BJP MP Virendra Singh: పిచ్చి ముదిరింది.. తలకు రోకలి చుట్టడం ఒకటే మిగిలింది అన్నాడట వెనుకటికి ఒక పెద్దమనిషి. ఈ బిజెపి ఎంపీ తీరు చూస్తే అలానే కనిపిస్తోంది. ప్రజలు చెల్లిస్తున్న పన్నులను ల్యాడ్స్ రూపంలో ఇస్తున్న నిధులను ఏకంగా గుళ్లో భజనల కోసం మంజూరు చేసిన ఈయన ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఉత్తరప్రదేశ్ తెలుసు కదా.. బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ మధ్య 2019లో ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి భారీగా ఎంపీ సీట్లు కట్టబెట్టింది. ఆ ఎన్నికల్లో బలియా నియోజకవర్గం నుంచి వీరేంద్ర సింగ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. ఆది నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. పనులు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు దేశం అంతా హిందుత్వం అనేది ఒక సెంటిమెంట్ రాజకీయం అయినందున… దానిని మరింత రగల్చాలని ఈ ఎంపీ గారి ఉద్దేశం కాబోలు. ఏకంగా గుళ్ళల్లో భజనలు చేసేందుకు ఏకంగా ఐదు కోట్లు మంజూరు చేశాడు. అధికారులను కూడా ఆదేశించాడు. వారు మాత్రం ఏం చేయగలరు? అసలే కేంద్రంలో వారి ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రంలో కూడా వారి పెత్తనమే. చేసేది ఏమీ లేక సదరు ఎంపీ గారు చెప్పినట్టే తల ఊపారు.

మరి వీటికి ఎవరిస్తారు
బలియా నియోజకవర్గం లో ప్రజలకు ప్రధాన వృత్తి వ్యవసాయమే. కానీ నేటికీ కొన్ని పంట పొలాలకు సరైన కాలువలు లేవు.. కాలువలు లేక వ్యవసాయ యోగ్యమైన భూమి ఇప్పటికీ బీడు గానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భూముల్లో కాలువలు తవ్వేందుకు నిధులు కేటాయిస్తే భూమి సాగులోకి వస్తుంది. రైతుల కష్టాలు తీరుతాయి. ఓటేసి గెలిపించిన ప్రజలకు ఏమాత్రం సేవ చేయాలనే సోయిలేని ఈ ఎంపీ గుళ్ళల్లో భజనలకు ఐదు కోట్లు ఇవ్వడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి.
అధ్వానం.. దరిద్రం
ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్లన్నీ దరిద్రంగా ఉన్నాయి.. మొన్నటి వర్షాలకు సర్వనాశనం అయ్యాయి. అయినప్పటికీ వాటి మరమ్మతులకు ఇంతవరకు ప్రతిపాదనలు వెళ్లలేదు. ఇక్కడ చాలావరకు పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేవు.. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సదురు ఎంపీ గారు కేటాయించిన ఐదు కోట్లతో సుమారు 60 పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టించవచ్చు. అవే డబ్బులతో అంతర్గత రహదారులకు మరమ్మతులు చేయవచ్చు. ఇవేవీ పట్టని ఎంపీ ఇలా నిధులను భజనలకు మళ్ళించడం దారుణాతీ దారుణం.

ఇంకా చాలా ఉన్నాయి
కేవలం రోడ్లు, కాల్వలు, పాఠశాలలు మాత్రమే కాదు… ఈ నియోజకవర్గంలో సమస్యలు చాలానే ఉన్నాయి. సొంత భవనాలు లేని అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేమి, షల్టర్ లేని గ్రామాలు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. సమస్యల పరిష్కారంపై దృష్టి లేని ఎంపీ భజనలకు, భుజకీర్తనలకు అలవాటు పడిపోయి ఐదు కోట్లు తన ఇంట్లో నుంచి ఇచ్చినట్టు ప్రభుత్వ సొమ్మును ఇవ్వడం ఏ విలువలకు నిదర్శనమో ఆయన చెప్పాలి. హిందుత్వం అంటే ఒక విధానం. అంతేగాని భజనలకు 5 కోట్లు ఇవ్వడం కాదు. నిజంగా ఇలాంటి ఎంపీ ని అనుకొని బలియా నియోజకవర్గ ప్రజలు చాలా పెద్ద తప్పు చేశారు. ఇది ఏంటని ఎంపీని విలేకర్లు ప్రశ్నిస్తే ఆయన నిర్ణయాన్ని సమర్థించుకోవడం గమనార్హం.