Telangana Congress: ‘ఒక పడవలో కొంతమంది నాయకులు సముద్రయానానికి బయల్దేరారు.. సముద్రం మధ్యలోకి రాగానే పడవకు చిల్లు పడింది. గమనించిన నాయకులు.. చిల్లు పూడ్చే ప్రయత్నం చేయడం లేదు.. దూరంగా వస్తున్న రెండు పడవలవైపు చూస్తున్నారు. అవి దగ్గరకు వచ్చాక సొంత పడవను ముంచి ఆ పడవల్లో దూకాలని చూస్తున్నారు’ ఈ చిన్నకథ.. కొంతమందికి అర్థమవుతుంది.. అవును 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ గురించే. మునిగిపోతున్న కాంగ్రెస్ నావను గట్టెక్కించాల్సిన నేతలు దానిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయకుండా.. ఇంకా ముంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే. ఒకవైపు ఆ పార్టీ సీనియన్ నేత, గాంధీ కుటుంబ వారసడు రాహుల్‌గాంధీ దేశాన్ని ఏకం చేయాలని భారత్ జోడోయాత్ర చేస్తుంటే.. తెలంగాణ నాయకులు మాత్రం పార్టీని చిలువలు పలువలు చేయాలని చూస్తున్నటు కనిపిస్తోంది .

అర్థంకాని నేతల తీరు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిస్థితులు ఏ మాత్రం అర్థం కావడం లేదు. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలపై పోరాడటం కంటే.. తమలో తాము పోరాడుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు. తాజాగా హైకమండ్ ప్రకటించిన కమిటీల విషయంలో ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కమిటీలో స్థానం దక్కలేదని కొందరు.. కమిటీలో చోటిచ్చినా తన కంటే జూనియర్లకు పెద్దపీట వేశారని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట కొండా సురేఖ ప్రారంభించగా, తర్వాత బెల్లయ్యనాయక్ తనకు ఆ పదవి వద్దని రాజీనామా చేశారు. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. అసంతృప్తిగా ఉన్నవారితో సమావేశం అవుతున్నారు.

సీఎల్పీ నేతపైనే అనుమానాలు..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కనే వ్యూహాత్మకంగా అసంతృప్త నేతలను రెచ్చగొడుతున్నారని.. కాంగ్రెస్‌లో ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డికి ఇటీవలి కాలంలో ఆయనే ఎక్కువగా అడ్డం పడుతున్నారు. రేవంత్ పాదయాత్ర చేస్తానంటే.. తాను కూడా చేస్తానని బయలుదేరారు. ఇప్పుడు ఆ పాదయాత్ర ఎటూ కాకుండా పోయింది. మరోవైపు పదవులు ఎక్కువగా రేవంత్‌వర్గానికి వచ్చాయంటూ.. ఇతరుల్ని రెచ్చగొట్టి రాజీనామాల వైపు మళ్లిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యాయం ముగిసింది. అయితే రేవంత్ నాయకత్వం ఇష్టం లేని సీనియర్లు.. భట్టి లాంటి నేతలతో తెర వెనుక ఉండి ఇలా రాజకీయం చేస్తున్నారన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. భట్టి విక్రమార్క కూడా.. ముందు పార్టీ గెలిస్తే ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చని అనుకోవడం లేదు.. పార్టీ గెలిచినా..కాస్త ముందుకెళ్లినా రేవంత్‌రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందోనని కంగారు పడుతున్నట్లుగా రాజకీయం ఉంది. దీంతో.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోతోంది. మొత్తంగా కాంగ్రెస్‌ను నిండా ముంచే వరకూ ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత వచ్చే అవకాశం కనిపించడం లేదు.