Mythri Movie Makers: సినిమా-మాఫియా కవల పిల్లలు. సినిమా కమర్షియల్ కోణం తీసుకున్నాక ఆర్థిక నేరాలు ఎక్కువయ్యాయి. బాలీవుడ్ లో మాఫియా ఎప్పటి నుండో వేళ్లూనుకుపోయింది. మెల్లగా అది సౌత్ ఇండస్ట్రీస్ కి కూడా వ్యాపిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. అక్రమ సంపాదన సక్రమంగా మార్చుకోవడానికి, నల్లధనం చలామణి చేసుకోవడానికి సినిమా తేలిక మార్గం. ఎందుకంటే సినిమా లెక్కలకు ఒక ప్రామాణికత ఉండదు. పావలా వచ్చినా పోయినా పది రూపాయలు అని చెప్పుకోవచ్చు.

మన దేశంలో సినిమా వసూళ్లకు ట్రాకింగ్ సిస్టం లేదు. అమెరికాలో మాదిరి తెగిన ప్రతి టికెట్ లెక్కల్లోకి రాదు. అదే సమయంలో ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ ని తప్పుబట్టే ఆధారాలు ఉండదు. పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో సినిమా కలెక్షన్స్ 30-40 శాతం ఎక్కువ చేసి చెబుతారు. అంటే వంద కోట్ల వసూలు చేసిందని నిర్మాతలు చెబితే… వాస్తవంలో అది ఒక రూ. 60 లేదా 70 కోట్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల లెక్కలు కూడా కరెక్ట్ కాదని డిస్ట్రిబ్యూటర్స్ మాట. కాబట్టి సినిమా పరిశ్రమలో పెద్ద మొత్తంలో ఆర్థిక నేరాలు, అవకతవకలు జరిగే ఆస్కారం ఉంటుంది.
ఒక్కో సంస్థ వందల కోట్లతో సినిమాలు తీస్తుంటే ఈ పెట్టుబడి మొత్తం ఎక్కడ నుండి వస్తుందని ఐటీ, జిఎస్టీ, ఈడీ అధికారులు పరిశ్రమపై దృష్టి పెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్-ఛార్మి లైగర్ మూవీ బడ్జెట్ వంద కోట్ల వరకూ చూపించారు. సినిమా వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. లైగర్ మూవీ నిర్మాణం, బిజినెస్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని ఈడీ విచారణ చేపట్టింది . తాజాగా అధికారుల దృష్టి మైత్రీ మూవీ మేకర్స్ పై పడింది. టాలీవుడ్ నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా అవతరించిన మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 10 సినిమాలు నిర్మిస్తుంది.

వీటిలో కొన్ని విడుదల సిద్ధం కాగా కొన్ని నిర్మాణ దశలో మరి కొన్ని భవిష్యత్ లో ప్రారంభం కానున్నాయి. మైత్రీ ప్రకటించిన చిత్రాలన్నీ టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. కొత్తగా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కి పెట్టుబడి అమెరికా నుండి హవాలా రూపంలో డబ్బు చేరుతుందని, రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎన్నారైలు అక్రమ సంపాదన సినిమాల్లో పెడుతున్నారనేది అధికారుల సందేహం. దీంతో సోమవారం(డిసెంబర్ 12) ఉదయం నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, నివాసాలపై దాడి చేశారు. ఐటీ, జీఎస్టీ అధికారులు నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి నివాసాలు శోధించారు. హార్ట్ డిస్కులు సీజ్ చేశారు. ఈ ఐటీ దాడులు టాలీవుడ్ ని షేక్ చేశాయి.