Birth Rate: కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. 2019లో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు జన్మించగా, 2021 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2021లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 922 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఇది నిజంగా కలవరపరిచే విషయం.
మరోవైపు, తెలంగాణలో జననాల రేటు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,96,166 మంది పిల్లలు జన్మిస్తే, పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 4,15,485 మంది జన్మించారు. అంటే, పట్టణాల్లో జననాల సంఖ్య గ్రామీణ ప్రాంతాల కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. 2021లో మొత్తం పుట్టిన పిల్లల్లో 3.18 లక్షల మంది మగ శిశువులు ఉండగా, ఆడ శిశువుల సంఖ్య 2.93 లక్షలుగా నమోదైంది.
ఇక మరణాల విషయానికి వస్తే.. 2021లో కోవిడ్ మహమ్మారి కారణంగా తెలంగాణలో మరణాల సంఖ్య 15.4శాతం పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1.08 లక్షల మంది మరణిస్తే, పట్టణ ప్రాంతాల్లో 1.26 లక్షల మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 2021లో మొత్తం 2.34 లక్షల మంది మరణించగా, వారిలో పురుషులు 1.35 లక్షలు, మహిళలు 98 వేల మంది ఉన్నారు. నవజాత శిశువుల మరణాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా శిశువులు మరణించడం గమనార్హం.
మరణించిన వారి వయస్సుల ప్రకారం చూస్తే.. 2021లో మరణించిన 2.34 లక్షల మందిలో 76 శాతం మంది 55 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. వివిధ వయస్సుల వారిలో మరణాల సంఖ్యను పరిశీలిస్తే, 35-44 ఏళ్ల మధ్య వయస్సు వారు 12 వేల మంది, 45-54 మధ్య వయస్సు వారు 22 వేల మంది, 55-64 మధ్య వయస్సున్న వారు 42 వేల మంది, 65-69 ఏళ్ల మధ్య వయస్సు వారు 85 వేల మంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 51 వేల మంది మరణించారు. నవజాత శిశు మరణాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, పెద్దపల్లి జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
2021లో తెలంగాణలో మొత్తం 6.11 లక్షల మంది పిల్లలు జన్మించగా, అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 95,666 మంది జన్మించారు. అతి తక్కువగా ములుగు జిల్లాలో కేవలం 3,868 మంది పిల్లలు మాత్రమే జన్మించారు. జననాల విషయంలో హైదరాబాద్ తర్వాత మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.