Bhopal Panipuri Seller: కాలం మారుతున్నా సమాజంలో లింగ వివక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆడపిల్లలను తల్లి కడుపులోనే చంపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఒక చిరువ్యాపారి మాత్రం కూతురు పుట్టడంతో సంతోషించారు. ఆ సంతోషానికి గుర్తుగా 50వేల రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా పానీపూరీని అందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కోలార్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కోలార్ కు చెందిన అంచల్ గుప్తా పానీపూరీ అమ్మడం ద్వారా జీవనం సాగించేవారు. గత నెల 17వ తేదీన అంచల్ భార్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్లలతోనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన అంచల్ చాలా సంతోషించాడు. 50వేల రూపాయలు ఖర్చు చేసి కోలార్ పట్టణవాసులకు పానీపూరీని ఉచితంగా అందించి మంచి మనస్సును చాటుకున్నాడు. అంచల్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆడపిల్ల పుట్టడం తన కల అని తొలి సంతానంలో కొడుకు పుట్టగా ఇప్పుడు కూతురు పుట్టడంతో తన సంతోషానికి అవధులు లేవని అంచల్ గుప్తా చెప్పుకొచ్చారు. అమ్మాయి పుట్టడంతో పానీపూరీని ఉచితంగా అందించాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని అంచల్ గుప్తా పేర్కొన్నారు. అంచల్ గుప్తా తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
అంచల్ గుప్తా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించడం గమనార్హం. నెటిజన్లు అంచల్ గుప్తా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మాయిలు ఉంటే మాత్రమే భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్న అంచల్ గుప్తా ఆ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఫ్రీగా పానీపూరిని అందించారు.