Bengaluru Husband And Wife: సెల్ ఫోన్ లో డ్యూయల్ సిమ్ లు ఉన్నట్టే.. మనుషులు కూడా డ్యూయల్ సంబంధాలకు అలవాటు పడుతున్నారు. అగ్నిసాక్షిగా నడిచిన ఏడు అడుగులకు వక్ర భాష్యం చెప్తున్నారు. పెళ్ళయి పిల్లలు ఉన్నా తమ నడవడిక మార్చుకోవడం లేదు. ఫలితంగానే పచ్చని సంసారాలు నిట్ట నిలువునా కూలిపోతున్నాయి. పిల్లా పాపలతో హాయిగా గడపాల్సింది పోయి జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన దుస్థితిలోకి దిగజారుతున్నారు. అలాంటి సంఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. మనుషుల్లో నానాటికి పెరిగిపోతున్న విశ్వంఖలత్వానికి ఈ సంఘటన తార్కాణంగా నిలిచింది.

ప్రియుడి మోజులో పడి
కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన అనుపల్లవికి, నవీన్ కు చాలా ఏళ్ళ క్రితమే పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. నవీన్ ఇంటివద్ద పిండి మిల్లు, క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఈ క్రమంలోనే అనుపల్లవికి హిమవంత్ కుమార్ అనే వ్యక్తితో పరిచయమైంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. నవీన్ క్యాబ్ కు కిరాయి వచ్చినప్పుడల్లా బయటికి వెళ్తుండేవాడు. ఇదే అదునుగా అనుపల్లవి హిమవంత్ కుమార్ ను ఇంటికి పిలిపించుకునేది. అనుపల్లవి వ్యవహారం ఆమె తల్లి అమ్మోజమ్మ కు తెలిసి మరింత ప్రోత్సహించింది. తమ బంధానికి నవీన్ అడ్డుగా ఉన్నాడని భావించి అనుపల్లవి, హిమావంత్ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని హిమావంత్ తనకు తెలిసిన ముగ్గురు కిరాయి హంతకులు హరీష్, నాగరాజు, ముగిలన్ తో చెప్పి అతడిని చంపాలని ₹2లక్షలకు డీల్ కుదుర్చున్నాడు. ముందస్తుగా ₹90 వేలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. కర్ణాటకలో చంపితే అనుమానం వస్తుందని భావించి తమిళనాడులో చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తమ ప్లాన్ ను అమల్లో పెట్టారు.
చంపేందుకు ధైర్యం సరిపోక
తాము తమిళనాడు వెళ్ళాలని నాగరాజు, హరీష్, ముగిలన్ నవీన్ కి ఫోన్ చేశారు. జూలై 20న నవీన్, హరీష్, ముగిలన్ కర్ణాటక నుంచి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళాక నాగరాజు క్యాబ్ లో ఎక్కాడు. అయితే నవీన్ ను చంపేందుకు ఆ ముగ్గురికి ధైర్యం రాలేదు. భయపడుకుంటూనే తమ ప్లాన్ ను నవీన్ కి చెప్పారు. దీంతో ఆ నలుగురు స్నేహితులయ్యారు. పార్టీ కూడా చేసుకున్నారు. ఈలోపు అనుపల్లవి వారికి ఫోన్ చేసింది. పని పూర్తయిందని నాగరాజ్, హరీష్, ముగిలన్ చెప్పారు. ఆధారాలు చూపాలని కోరగా.. నవీన్ ను పడుకోబెట్టి అతనిపై టమాట సాస్ పోసి ఫోటోలు తీసి ఆమె సెల్ ఫోన్ కు పంపారు. దీంతో ఆమె మిగతా 1.10 లక్షలను పంపేసింది. అయితే ఈ ఫోటోలను చూసిన హిమవంత్ కుమార్ భయపడిపోయాడు.

పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించి ఆగస్టు ఒకటిన తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మరోవైపు నవీన్ కనపడక పోవడం, అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అనుపల్లవిని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి నవీన్ చెల్లి ఆగస్టు 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు దర్యాప్తు చేస్తుండగా ఆగస్టు ఆరున నవీన్ ఇంటికి వచ్చాడు. అతడిని చూసి అనుపల్లవి అవాక్కయింది. పోలీసులు ప్రశ్నించగా పూస గుచ్చినట్టు జరిగిందంతా నవీన్ చెప్పాడు. పోలీసులు దీన్ని నిర్ధారించుకునేందుకు అనుపల్లవి, హిమవంత్ కుమార్ ఫోన్లు తనిఖీ చేశారు. జరిగిందంతా నిజమేనని రూడీ చేసుకొని ఆ ముగ్గురు కిరాయి హంతకులను, అనుపల్లవిని అరెస్ట్ చేశారు. ఇంత జరిగినా తన భార్య అంటే ప్రేమని, ఆమెను నేను క్షమిస్తానని నవీన్ పేర్కొనడం గమనార్హం. అయితే తన భార్యను అరెస్ట్ చేయొద్దని నవీన్ బతిమిలాడితే పోలీసులు తోసిపుచ్చారు. అనుపల్లవి చేసిన నిర్వాకం, అందుకు ఆమె తల్లి అమ్మోజమ్మ చేసిన సహకారం సభ్య సమాజం ముందు నవీన్ ను తల దించుకునేలా చేసింది. అతడి ఇద్దరి పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు హృదయాలను ద్రవింప చేస్తోంది.

