https://oktelugu.com/

Tamilnadu : హీరోయిన్ ను చేస్తామని అందమైన అమ్మాయిలను నమ్మించడం.. తర్వాత ఆ  పనిచేయడం

తరువాత పత్తా లేకుండా పోయారు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తుండడంతో బాధితులంతా సదరు క్రియేషన్స్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేశారు. అయితే తాము నటీనటులు కావాలన్న ప్రకటనే చేయలేదని చెప్పడంతో బాధితులు షాక్ కు గురయ్యారు. మోసపోయామని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 24, 2023 6:47 pm
    Follow us on

    Tamilnadu : అందం, అభినయం ఉన్న చాలా మంది సినిమా రంగంలో అదృష్టం పరీక్షించుకుంటారు. ఒకే ఒక్క చాన్స్ అంటూ స్టూడియోలు, దర్శకుల కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. వర్కవుట్ అవ్వకపోయేసరికి కొందరు విసిగి వేశారిపోయి తిరుగు ముఖం పడుతుంటారు. మరికొందరు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి సక్సెస్ బాట పడుతుంటారు. అయితే ఇలా తిరిగే వారికి కొందరు కల్పతరువుగా నిలుస్తుంటారు. మరికొందరు మాత్రం మీకు సినీ అవకాశం కల్పిస్తామని నమ్మబలికి నిలువు దోపిడీకి గురిచేస్తుంటారు. అటువంటి ఘటనే చెన్నైలో తాజాగా వెలుగుచూసింది. సినిమా అవకాశాల కోసం తిరిగే అమ్మాయిలను టార్గెట్ చేసుకొని ఓ ముఠా చేసిన మోసం చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోతారు.

    తమిళనాడుకు చెందిన ఓ యువతి సినిమాల్లో నటించాలని బలమైన కోరిక ఉండేది. దీంతో అవకాశాల కోసం స్టూడియోలు, దర్శకుల కార్యాలయాల చుట్టూ తిరిగేది. కానీ ఎక్కడా అవకాశం దొరకలేదు. అలాగని మనసులో నటనపై మక్కువ తగ్గలేదు. ఈ తరుణంలో టీ నగర్ లోని ప్రకాశం రోడ్డులో కొందరు వ్యక్తులు ఓ క్రియేషన్ పేరుతో కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తామని ప్రచారం కల్పించారు. అది ఈ నోటా ఆ నోటా పడి సదరు యువతి వరకూ చేరింది. వెంటనే సదరు నిర్వాహకులను యువతి సంప్రదించింది. తనకు సినిమా చాన్స్ ఇవ్వాలని కోరింది. అయితే నిర్వాహకులు షరతుపెట్టారు. తమకు నగదు ఇవ్వాలని పట్టుబట్టారు. నటనపై ఉన్న పిచ్చితో సదరు యువతి పలుమార్లు లక్షల రూపాయలు సమర్పించుకుంది.

    అయితే ఆ ఒక్క యువతే కాదు. పదుల సంఖ్యలో యువతులు సదరు వ్యక్తులకు లక్షలాది రూపాయలు ముట్టచెప్పారు. అడిషన్స్ అంటూ హడావుడి చేస్తూ వచ్చిన సదరు నిర్వహకులు మూడు నెలల పాటు అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తరువాత పత్తా లేకుండా పోయారు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తుండడంతో బాధితులంతా సదరు క్రియేషన్స్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేశారు. అయితే తాము నటీనటులు కావాలన్న ప్రకటనే చేయలేదని చెప్పడంతో బాధితులు షాక్ కు గురయ్యారు. మోసపోయామని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. లక్షలాది రూపాయలు ముట్టజెప్పిన బాధితులకు నగదు పోవడంతో పాటు నటన అవకాశం దొరకక లబోదిబోమంటున్నారు.