
Bandi Sanjay- 10th Paper Leak: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో గంట గంటకో విషయాన్ని పోలీసులు లీక్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం మొదలైన ఈ ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం మంత్రి హరీశ్‌రావు ద్వారా భారీ టిస్ట్‌ను రివీల్ చేశారు పోలీసులు. పదో తరగతి పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారితో బండి సంజయ్ మాట్లాడారని ఆరోపించారు. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడతారా? అని మండిపడ్డారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని సవాల్ చేశారు. పట్టపగలు స్పష్టంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని ఆయన ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
ప్రశాంత్‌తో మాట్లాడారా..
వాట్సప్‌లో ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆయన సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపించింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. రోజుకో పేపర్ లీకేజీ పేరుతో బీజేపీ కుట్రలు పన్నిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. సంజయ్‌కు ప్రశ్నపత్రం పంపిన ప్రశాంత్.. 2 గంటల్లో 142 సార్లు ఫోన్‌లో మాట్లాడాడని వెల్లడించారు. లీకేజీ విషయంలో భాగంగానే సంజయ్‌కు కూడా ఫోన్ చేశాడని ఆరోపించారు. తన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే మంత్రి హరీశ్‌రావు ఈ మాటాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. అరెస్ట్ విషయం ఎవరికీ చెప్పకుండా ఉన్న పోలీసులు, బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం సమాచారం అందిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. అధికారం తమ చేతుల్లో ఉందని పోలీసులను బెదిరించి తప్పుడు సమాచారం, రిపోర్టు రాయిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీఆర్‌ఎస్ ఆదేశాల మేరకే ఎఫ్‌ఐఆర్?
ఇక బండి సంజయ్‌పై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలి అనే విషయం కూడా బీఆర్‌ఎస్ కనుసన్నల్లోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని విషయాలపై బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ సూచన మేరకే వ్యవహారం నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకముందే.. బండి సంజయ్‌పై మీడియా ద్వారా మంత్రులు ఆరోపణలు చేయడం, ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. అంటే మొత్తం వ్యవహారం బీఆర్‌ఎస్ స్క్రిప్ట్ మేరకే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సంజయ్‌ను ప్రవేశపెట్టకముందే పోలీసుల వద్ద ఉండాల్సిన సమాచారం మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎలా తెలుస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.