Homeజాతీయ వార్తలుTelangana New Secretariat: తెలంగాణ సచివాలయం రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే?

Telangana New Secretariat: తెలంగాణ సచివాలయం రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే?

Telangana New Secretariat
Telangana New Secretariat

Telangana New Secretariat: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 30న సచివాలయం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు.

30న శాస్త్రోక్తంగా పూజలు..
ఏప్రిల్‌ 30న ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ తెలంగాణ సచివాలయం’ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొంటారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

తొలి అడుగు సీఎందే..
సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన చాంబర్‌లో ఆసీనులవుతారు. తర్వాత వెంటవచ్చిన మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో సిబ్బంది, సచివాలయ సిబ్బంది తమతమ చాంబర్లలోకి వెళ్లి తమ సీట్లల్లో ఆసీనులు అవుతారు.

2,500 మంది వరకు హాజరు..
సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సచివాలయ సిబ్బందితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌వోడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధుసమితి అధ్యక్షులు, మున్సిపల్‌ మేయర్లు తదితరులు పాల్గొంటారు. అందరూ కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారు. వీరందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో సచివాలయం రక్షణకు సంబంధించి డీజీపీ విధివిధానాలు రూపొందించి పకడ్బందీ చర్యలు చేపడుతారు.

Telangana New Secretariat
Telangana New Secretariat

ద్వారాలు.. రాకపోకలు..
సచివాలయం నాలుగు దికుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్‌(వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు. నార్త్‌ఈస్ట్‌(ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్‌ఈస్ట్‌(ఆగ్నేయం) ద్వారం విజిటర్స్‌ కోసం వినియోగిస్తారు. సచివాలయ సందర్శన ప్రతీరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఇక తూర్పుగేట్‌(మెయిన్‌ గేట్‌) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు.

వృద్ధులు, దివ్యాంగులకు ఎలక్ట్రిక్‌ వాహనాలు..
సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్‌ బగ్గీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్‌ వాహనాలను సచివాలయంలోకి అనుమతించరు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular