Dil Raju- Balagam Movie: తెలంగాణా రాష్ట్రంలో బలగం మూవీ బహిరంగ ప్రదర్శనలు జరుగుతున్నాయి. అనేక గ్రామాల్లో ప్రొజెక్టర్ వేసి ఊరి జనమంతగా ఓ చోట చేరి వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా బలగం చిత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా తమకు నష్టమని దిల్ రాజు చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. గ్రామాల్లో బలగం చిత్ర ప్రదర్శనలు ఆపాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బలగం మూవీ మీద ఓ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. రెండు వేలకు మూడు వేలకు ప్రొజెక్టర్ వేసి ప్రదర్శిస్తామంటూ ప్రకటనలు కూడా ఇస్తున్నారు. బలగం మూవీ బహిరంగ ప్రదర్శనలు మేము అడ్డుకుంటున్నాము అనడంలో నిజం లేదు. కాకపోతే మాకు కొన్ని లీగల్ ట్రబుల్స్ ఉంటాయి. ఈ చిత్రాన్ని ఓటీటీకి అమ్మడం వలన వారి నుండి ఒత్తిడి వచ్చింది. మెయిల్ పెట్టారు. దానిలో భాగంగా మా టీమ్ కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ వెళ్లడం జరిగింది. అయినప్పటికీ బలగం మూవీ ప్రదర్శనలు జరుగుతాయి. మంచి సినిమా చేశాము అనుకున్నాము కానీ… ఇంత గొప్ప మూవీ అవుతుందనుకోలేదు.
ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. మా సినిమా చూసి కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతున్నాయంటే అంతకన్నా సంతోషం లేదు. మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. ఎవరైనా సరైన సౌకర్యాలు లేక బలగం మూవీ చూడలేకపోతే మాకు ఫోన్ చేయండి. మేమే స్వయంగా ఏర్పాటు చేస్తాము. డబ్బు, వ్యాపారం ముఖ్యం కాదు. ఈ సినిమా జనాలకు చేరాలన్నదే మా లక్ష్యం. సాధారణంగా థియేటర్, ఓటీటీ, టీవీలలో సినిమాలు చూస్తారు. బలగం ద్వారా నాలుగో మార్గం ఓపెన్ అయ్యింది… అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై డబుల్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. తెలంగాణా పల్లె జీవనాన్ని హైలెట్ చేస్తూ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు.