
Bairi Naresh Troll: అయ్యప్ప ఎవరు? ఆయన ఎవరికి జన్మించారు? ఆయనను దేవుడు అని ఎవరు ప్రకటించారు? అసలు ఆయనను భక్తితో ఎందుకు కొలవాలి? ఒకవేళ అతడు జన్మించి ఉంటే, అతడి ఆధార్ కార్డు నాకు కావాలి. చదువుతుంటే తిక్క తిక్కగా ఉంది కదా. ఇలాంటి తలతిక్క వ్యాఖ్యలు చేసినందుకే నాస్తిక వాదిగా చెప్పుకుంటున్న బైరి నరేష్ ను కొంతమంది చితక బాదారు.. అయినప్పటికీ అతడు తన నోరు అదుపులో పెట్టుకోవడం లేదు.. చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు.
వాస్తవానికి ఏ మతం కూడా ఇంకో మతాన్ని దూషించమని చెప్పదు.. ఏ దేవుడు కూడా తనను పూజించమని అడగడు. అది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఇండియాలో ఉండే చాలామంది కమ్యూనిస్టులకు చైనా అంటే చాలా ఇష్టం ఉంటుంది. అక్కడి విధానాలంటే ఎక్కడా లేని అభిమానం ఉంటుంది.. కొంతమంది మావోను దేవుడు లాగా పూజిస్తూ ఉంటారు. మరి వాళ్ళకున్నట్టే ఇతరులకు కూడా దేవుళ్ళు అంటే భక్తి భావాలు ఉంటాయి. దానిని తప్పు పడితే ఎలా? వాళ్లు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అంటే ఎలా? మెజారిటీ ప్రజల మనోభావాలకు ఈ దేశంలో విలువ లేదా? వాళ్లు వాళ్లకు నచ్చిన దేవుడిని పూజించుకుంటున్నారు అందులో తప్పేముంది? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా.. బైరి నరేష్ ఎలాగైతే నాస్తిక వాదాన్ని ప్రచారం చేసుకుంటున్నాడో… మిగతావాళ్లు తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. అంతేకానీ బైరి నరేష్ నువ్వెందుకు నాస్తిక వాదాన్ని ప్రచారం చేస్తున్నావని ప్రశ్నించడం లేదు. ఇదే విషయం కొంతమంది సూడో మేధావులకు అర్థం కావడం లేదు. పైగా వారు చేస్తున్న వ్యాఖ్యలన్నీ పూర్తి అబ్సర్డ్ గా ఉన్నాయి.

వాస్తవానికి మనుషులు చేసే తప్పులకు దేవుళ్ళను నిందించడం దారుణం. ఒక మనిషి అత్యాచారం చేస్తే, ఒక మనిషి హత్య చేస్తే, ఒక మనిషి ఇంకో వ్యక్తిని దోచుకుంటే… దానిని దేవుడికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఖురాన్, బైబిల్, భగవద్గీతలో నీతి సూత్రాలు పొందుపరిచి ఉన్నాయి. మరి మనుషులు వాటిని ఎందుకు అనుసరించడం లేదు? వాటి ఆధారంగా జీవనం సాగించడం లేదు? ఇవేవీ చెప్పేందుకు నరేష్ ఇష్టపడటం లేదు. కేవలం మీడియాలో ఫోకస్ అయ్యేందుకు మాత్రమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు.. అతని వ్యాఖ్యలు నచ్చని కొంతమంది అతనిపై దాడులు చేస్తున్నారు. అనవసరమైన విషయాలను గెలికి నానా రచ్చ చేస్తున్నారు.