
Baboons: అల్లరి పనులు చేస్తే..‘ఏంటా ఆ కోతి చేష్టలు? కుదురుగా ఉండలేవా అంటూ తిడుతుంటారు. పాడు పనులు చేసినా..చేసే పని చెడగొడుతున్నా అలా తిట్టడం సర్వసాధారణం. అందుకే ‘తాను చెడిన కోతి వనమంతా చెరిచింది’ అన్న నానుడి తెలుగునాట బహుళ ప్రాచుర్యం పొందింది. నానా అల్లరి చేసే కోతులు, కొండముచ్చులు ఒక చోట కామ్ గా కూర్చుంటే అది విశేషమే. అలా కూర్చోవడమే కాదు.. మనుషుల్లా సహపంక్తి భోజనాలు చేయడం చూస్తే అదో వింత. అటువంటి దృశ్యమే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లకు విశేషంగా ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రలోని ఓ ఆశ్రమంలో మనుషులతో పాటు కొండముచ్చులు వరుసగా కూర్చొని సహపంక్తి భోజనాలు చేయడం విశేషం.
సాధారణంగా కోతులు, కొండముచ్చులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్క చెట్టుపై నుంచి మరో చెట్టుకు.. అలాగే ఒక బిల్డింగ్ మీద నుంచి మరోదానిపైకి ఎక్కుతూ.. దిగుతూ తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి చేసే చర్యలు కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించినా.. వాటి చేష్టలు, చర్యలు చూడటానికి మాత్రం ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కొండముచ్చుల గుంపు క్రమశిక్షణగా సహపంక్తి భోజనాలు చేయడం విశేషం.కొండముచ్చులు, కోతుల్లో అల్లరినే చూస్తుంటాం. ఇలా కుదురుగా కూర్చుంటాయని అనుకోం కదా అంటూ కొందరు ఫోటోలు జతచేసి సోషల్ మీడియాలో షేర్ చేయటం అదికాస్తా వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని అకోలా జిల్లా బాషిటేకడి తాలుకా కోతడి గ్రామంలోని ముంగసాజి మహారాజ్ ఆశ్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటుచేశారు. దీంతో కొండముచ్చుల గుంపు అక్కడకు చేరుకుంది. స్థానికులు సహపంక్తి భోజనాలు చేస్తుండగా.. వారి పక్కనే ప్లేట్లు పట్టుకొని కొండముచ్చులు కూర్చున్నాయి. అల్లరి చిల్లరి పనులు చేయకుండా కడుపునిండా భోజనాన్ని ఆరగించాయి. స్థానికులు ఫొటోలు, వీడియోలు బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. హనుమాన్ జయంతి నాడు కావడంతో అది దైవకృప అన్నవారే అధికం.