
Satyanarayana Vratam : మనం చేసే ప్రతీకార్యంలో దైవానుగ్రహం ఉండాలని కోరుకుంటాం. దేవుడి అండ ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుందని నమ్ముతాం. అందుకే ఏ పని ప్రారంభించినా ముందుగా దేవుడిని పూజించిన తరువాతే మిగతావి మొదలుపెడుతాం. చాలా ఇళ్లల్లో ఇల్లు కట్టుకున్న తరువాత, పెళ్లి చేసిన తరువాత సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని పండుగలా జరుపుకుంటూ చుట్టాలను, స్నేహితులను ఆహ్వానిస్తాం. అయితే చాలా మంది ఈ కార్యక్రమానికి వస్తుంటారు.. వెళ్తుంటారు.. కొత్తగా పెళ్లయిన జంట గురించే మాట్లాడుకుంటారు. కానీ వారితో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారో అన్న సందేహం కొందరికి వస్తోంది. మరి ఆ సందేహం తొలిగిపోవాలంటే ఈ స్టోరీ చదవండి..
జీవితంలో పెద్ద కార్యాలు నిర్వహించేటప్పుడు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తుంటారు. ఇళ్లల్లో సౌకర్యం లేనివారు సత్యనారాయణ ఆలయాలు లేదా విష్ణు ఆలయాల్లో నిర్వహించుకుంటూ ఉంటారు. సత్యనారాయణ వ్రతం ఎంతో నిష్టతో చేయాల్సి ఉంటుంది. ఈ వ్రతం పూర్తి కావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. కానీ ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో లాభాలు జరుగుతాయని అంటారు. అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడు, పెళ్లయిన సందర్భంలోనే కాకుండా ప్రతీ ఏడాది కొన్ని ప్రత్యేక రోజుల్లో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు.

ఒక ఇంట్లో పెళ్లి జరిగిన తరువాత తప్పకుండా సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహిస్తారు. సత్యనారాయణుడి అనుగ్రహం వల్ల ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అయితే కొత్త జంటతో వ్రతాన్ని చేయించడంపై కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వధూవరులిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. వారి జీవితం బాగుండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు. అలాగే వారి జీవితంలో ఎటువంటి సామాగ్రి కొన్నా, ఏ పనిచేసినా సత్యనారాయణుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు.
మరో విషయమేంటంటే సత్యనారాయణ వ్రతం సందర్భంగా చుట్టాలు, స్నేహితులు ఇంటికి వస్తారు. ఈ సందర్భంగా ఇంటికి వచ్చిన కోడలును వారికి పరిచయం చేస్తారట. ఆమె గురించి చెబుతూ అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటారట. అందుకే ఈ వ్రతాన్ని పెళ్లయిన తరువాత నిర్వహిస్తారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ వ్రతం చేసిన జంట ఆనందంగా జీవించాలని అక్కడికి వచ్చిన వారు ఆశీర్వదిస్తారని అంటున్నారు.