‘అవసరాల శ్రీనివాస్..’ హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా తన టాలెంట్ ను టాలీవుడ్లో ఘనంగా చాటుకున్నాడు. ‘అష్టాచమ్మా’ సినిమాతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవసరాల.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. అయితే.. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనను అవసరాల అన్యాయంగా తిట్టి, బయటకు గెంటేశాడంటూ ఓ కో-డైరెక్టర్ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో సదరు కో-డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్టు కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను మూడేళ్లుగా పనిచేస్తున్నాను. నేను ఏ తప్పూ చేయకపోయినా.. ఈ రోజు అందరి ముందు తిటి బయటకు పంపించాడు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి’’ అంటూ అవసరాల శ్రీనివాస్ నెత్తికి పెట్టుకున్న క్యాప్ ను బలవంతంగా ఊడదీశాడు.
దీంతో.. అవసరాల బట్టతలతో కనిపించాడు. ఇది చూసిన వారంతా షాకయ్యారు. దీంతో.. అక్కడి నుంచి కో-డైరెక్టర్ పారిపోయాడు. కంగారు పడిన అవసరాల ‘‘ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా’’ అంటూ హెచ్చరించడం కూడా వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. ఇదంతా సినిమా ప్రమోషన్లో భాగమని అంటున్నారు చాలా మంది. అవసరాల శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ వీడియో ప్లాన్ చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ విద్యాసాగర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, డైరెక్టర్ క్రిష్ నిర్మిస్తున్నారు.