https://oktelugu.com/

Jalebi Fight: పది రూపాయల జిలేబీ కోసం.. వీధుల్లో పడి దాడులు చేసుకున్నారు.. వీడియో వైరల్..

పెళ్లిళ్లో.. లేదా ఇతర వేడుకల్లో మటన్ ముక్కలు సరిగ్గా వేయలేదనో.. చికెన్ కూర సరిపడా వడ్డించలేదనే నెపంతో దాడులు చేసుకోవడం చూసాం. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన ఉదంతాల తాలూకూ వార్తలు కూడా చదివాం. కానీ పది రూపాయల జిలేబీ కోసం కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. పోనీ చదివారా?

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 17, 2024 / 09:02 AM IST

    Jalebi Fight

    Follow us on

    Jalebi Fight: పది రూపాయలు.. కేవలం పది రూపాయలు విలువచేసే జిలేబి కోసం ఇద్దరు వ్యక్తులు వీధుల్లో పడి కొట్టుకున్నారు. ఏకంగా భీకరమైన యుద్ధం చేసుకున్నారు. ఒకరిపై మరొకరు దారుణంగా దాడులు చేసుకున్నారు. పది రూపాయలు విలువచేసే జిలేబి కోసం విక్రయిదారుడు, వినియోగదారుడు మధ్య జరిగిన వాగ్వాదం తారస్థాయికి చేరింది. చినికి చినికి గాలి వాన లాగా మారింది. వారిద్దరూ పరస్పరం కర్రలతో దాడులు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మొదటగా ఈ గొడవ చూసేవాళ్ళకు అర్థం కాకపోయినప్పటికీ.. వాళ్లు అదేపనిగా కొట్టుకుంటుండడంతో ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు సంఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని.. దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

    ఇంతకీ ఏం జరిగిందంటే..

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలోని మురార్ పోలీస్ స్టేషన్ పక్కన బారాదరి అనే ఒక కూడలి ఉంది. ఇక్కడ రోడ్డు పక్కన ఓ వ్యక్తి దుకాణాన్ని అద్దెకి తీసుకున్నాడు. ఉదయం పూట అక్కడ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రాత్రిపూట స్నాక్స్ అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి స్నాక్స్ కొనుగోలు చేసేందుకు రవి శ్రీనివాస్, అతని స్నేహితులు వచ్చారు. పది రూపాయల నోట్ ఇచ్చి.. దానికి తగ్గట్టుగా జిలేబి ఇవ్వాలని అడిగారు. దానికి దుకాణదారుడు పది రూపాయలకు జిలేబి ఇవ్వబోనని స్పష్టం చేశాడు. దీంతో రవి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పది రూపాయలకు జిలేబి ఎందుకు ఇవ్వవు అంటూ దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అయితే వారిద్దరూ గొడవ పడుతున్న నేపథ్యంలో ఆ దుకాణం యజమాని నిరంజన్ గురుజార్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రవి శ్రీనివాస్, అతడి అనుచరులు నిరంజన్ పై దాడికి తెగబడ్డారు. రాయడానికి వీలు లేని బూతులు తిట్టారు. ఇద్దరు పరస్పరం దాడి చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ప్రస్తుతం ఈ గొడవ మురార్ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

    సామాజిక మాధ్యమాలలో..

    వారిద్దరి గొడవకు సంబంధించి కొంతమంది తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. పది రూపాయల జిలేబి కోసం ఇద్దరు యుద్ధం చేసుకున్నారని రాసుకొచ్చారు. కాగా, వారిద్దరూ పరస్పరం దాడి చేసుకుంటున్న సమయంలో కొంతమంది వీడియో తీసి.. పది రూపాయల జిలేబి కోసం ఇలా కొట్టుకుంటారా ? అని వ్యాఖ్యానించుకున్నారు. ఆ సంభాషణలు కూడా సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. అంత గొడవ జరుగుతున్న సమయంలో వారిని ఆపడానికి స్థానికులు ప్రయత్నించి ఉంటే బాగుండేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ₹10 జిలేబి కోసం కొట్టుకోవడం కొత్తగా ఉందని వారు అంటున్నారు.