Bandlaguda Ganapati Laddu : గత ఏడాది 1.20 కోట్లు.. ఇప్పుడు దాన్ని తలదన్నేలా.. ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన బండ్లగూడ గణపతి లడ్డు

గణపతి శోభాయాత్ర దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలుతున్నారు. ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 17, 2024 9:16 am

Bandlaguda Ganapati Laddu

Follow us on

Bandlaguda Ganapati Laddu  : గణపతి నిమజ్జనం సందర్భంగా స్వామివారి చేతిలో తొమ్మిది రోజులపాటు విశేషమైన పూజలు అందుకున్న లడ్డూలకు వేలంపాట నిర్వహిస్తారు. ఈ వేలం పాటలో అనాది నుంచి బాలాపూర్ లడ్డు కు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది ఇక్కడి లడ్డూను వేలం వేస్తే.. రికార్డు స్థాయిలో ధరకు అమ్ముడుపోతుంది. ఈ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారులు ఎక్కువగా ఉండడం వల్ల వారంతా పోటాపోటీగా లడ్డూను వేలం పాడుతారు. దాదాపు కోట్లు చెల్లించి దానిని దక్కించుకుంటారు. లడ్డును దక్కించుకున్న అనంతరం తమ స్థిరాస్తి వెంచర్లలో చల్లుతారు. అలా చల్లితే గణపతి చల్లని చూపు తమపై ఉంటుందని వారి నమ్మకం. వారి వ్యాపారం మరింత మెరుగ్గా సాగుతుందని భావిస్తుంటారు. అయితే బాలాపూర్ కు మించిన ధర హైదరాబాద్లోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణపతి లడ్డు పలుకుతోంది.

ఈసారి కూడా రికార్డు స్థాయిలో. .

హైదరాబాదులోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీర్తి రిచ్ మండ్ విల్లాస్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ ఐటీ, ఫార్మా రంగాలకు చెందినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరిలో చాలామంది సీఈఓ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. తొమ్మిది రోజులపాటు విశేషమైన పూజలు నిర్వహించి అన్నదానాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు కొనసాగిస్తారు. అయితే ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న లడ్డువేలంలో రికార్డు స్థాయి ధర పలుకుతోంది. గత ఏడాది ఈ ప్రాంతంలో ప్రతిష్టించిన గణపతి లడ్డును వేలం వేయగా 1.20 కోట్లు పలికింది. ఈసారి వేలం వెయ్యగా గత ఏడాది కంటే 67 లక్షలు అదనంగా వచ్చాయి. మొత్తంగా 1.87 కోట్లకు ఓ భక్తుడు లడ్డును దక్కించుకున్నాడు.. అయితే ఆ భక్తుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. లడ్డూ వేలంలో లభించిన సొమ్ము ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ బాధ్యులు పేర్కొన్నారు..” మా గణపతి లడ్డు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. వేలం నిర్వహించినప్పుడు విశేషమైన స్పందన లభిస్తోంది. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న గణపతి చేతిలోని లడ్డు చాలా విశిష్టమైనదని భావిస్తుంటారు. అందువల్లే దానిని కొనుగోలు చేయడానికి చాలామంది పోటీ పడుతుంటారు. రికార్డు స్థాయిలో ధర లభించడం ఆనందంగా ఉంది. ఈ డబ్బును ధార్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాం. గత ఏడాది వచ్చిన డబ్బులను కూడా సేవా కార్యక్రమాల కోసం వెచ్చించామని” కీర్తి రిచ్ మండ్ విల్లాస్ బాధ్యులు వివరించారు.

అందువల్లే భారీ ధర

గతంలో బాలాపూర్ లడ్డుకు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పటికీ ఆ క్రేజ్ అలాగే ఉంది. అయితే బాలాపూర్ లడ్డును తలదన్నే విధంగా కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో ధర పలుకుతోంది. మంగళవారం బాలాపూర్ గణపతి నిమజ్జనానికి తరలుతున్నాడు. అయితే అక్కడి లడ్డూ వేలం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ లడ్డు భారీ ధర కనక పలికితే కీర్తి విల్లాస్ రికార్డు బ్రేక్ అవడం ఖాయం. కాగా, కొన్ని సంవత్సరాలుగా బండ్లగూడ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఫార్మా కంపెనీలు కూడా పరిసర ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అందువల్లే గణపతి లడ్డుకు భారీ ధర పలుకుతోందని స్థానికులు అంటున్నారు.