SC- ST Sub Plan Funds: సామాజిక అణచివేత. ఆర్థిక దోపిడీ. అడుగడుగునా వివక్ష. సొంత భూమిలోనే పరాయి బతుకు. ఇదీ తరతరాలుగా ఎస్సీ,ఎస్టీల జీవన చిత్రం. స్వతంత్ర భారత దేశంలో ఎస్సీ, ఎస్టీల స్థితిగతుల్లో ఎలాంటి పెనుమార్పులు సంభవించలేదు. ప్రభుత్వాలు అందుకు చిత్తశుద్ధితో కృషి చేయలేదు. ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. కంచె చేను మేసినట్టుగా.. వారే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. దారి మళ్లుతున్న నిధుల్ని సక్రమ మార్గం పట్టించడానికే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చారు.

ఏపీ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ఏమిటీ..
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ఈ సబ్ ప్లాన్ లక్ష్యం. వీటిలో 40 శాతం మూలధన నిధులు ఎస్సీ, ఎస్టీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించాలి. 2013 మే నెలలో ఏపీ శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించిన చట్టం ఆమోదించబడింది. అంతకు ముందు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వాలు నిధులు కేటాయించినప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించేవారు కాదు. ఇతరత్రా అవసరాలకు ఎస్సీ,ఎస్టీ నిధులు మళ్లించేవారు. దీంతో ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధుల లక్ష్యం నీరుగారేది. దారిమళ్లుతున్న నిధులకు అడ్డుకట్ట వేయడానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించారు.
ఎన్ని నిధులు కేటాయించారు.. ఎంత ఖర్చు చేశారు ?
ప్రతి బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీల కోసం నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎస్సీల జనాభా పరంగా 16.23 శాతం నిధుల్ని బడ్జెట్ నుంచి కేటాయించాలి. ఎస్టీల జనాభా పరంగా 6.6 శాతం నిధుల్ని బడ్జెట్ నుంచి కేటాయించాలి. సబ్ ప్లాన్ ప్రకారం ప్రతి బడ్జెట్లో నిధుల్ని కేటాయించినప్పటికీ సబ్ ప్లాన్ లక్ష్యాన్నిమాత్రం నీరుగారుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లక్ష్యం .. వారికి కేటాయించిన నిధుల్ని వారికే ఖర్చు పెట్టడం. కానీ ప్రభుత్వాలు ఆ పనే సక్రమంగా చేయడం లేదు. నిధులు ఖర్చు పెట్టినట్టు పేపర్ల మీద చూపిస్తున్నారు తప్పా.. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టడం లేదు.
ఏపీలో ఎస్సీల అభివద్ధికి రూ. 9225.28 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. 2019 నుంచి 2022 వరకు 49,710 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. కానీ నవరత్నాల కింద ఈ నిధుల్ని ఖర్చు చేశారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, పెన్షన్లు ఇతర పథకాల కింద ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని ఖర్చు చేశారు. కానీ సబ్ ప్లాన్ లక్ష్యం అది కాదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో స్కూల్, కాలేజ్, టాయిలెట్, తాగునీరు, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లోని 40 శాతం నిధుల్ని అందుకు కేటాయించాలి. కానీ సబ్ ప్లాన్ లక్ష్యం ప్రకారం ఏపీ ప్రభుత్వం నిధుల్ని ఖర్చు పెట్టడం లేదు. నవరత్నాలతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని ఖర్చు చేయాలని.

స్కీంతో ఎవరికి లబ్ధి చేకూరుతుంది..
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీలకు, ఎస్టీలకు లబ్ధి చేకూరుతుంది. ఏళ్ల తరబడి అణచివేతకు, ఆర్థిక దోపిడీకి , వివక్షకు గురవుతున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పురుడు పోసుకుంది. మన దేశంలో 1975-76 మధ్య కాలంలో తొలిసారి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టారు. 1979-80 మధ్య కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చారు. కానీ ఏపీలో 2013లో చట్టంగా మార్చారు. ఈ నిధులతో ఎస్సీ,ఎస్టీలకు మౌలిక సదుపాయాలు కల్పించి, ఆర్థిక, సామాజిక స్థితిని పెంపొందించాలన్నది సబ్ ప్లాన్ ప్రధాన ఉద్దేశ్యం.
ఏపీలో సరిగ్గా అమలు అవుతుందా? లేదా?..
2019 నుంచి 2022 వరకు ఏపీలో 49,710 కోట్లు ఖర్చు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అది కూడా నవరత్నాల కింద ఎస్సీ, ఎస్టీలకు నిధులు ఖర్చు చేశారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి.. వేరే పథకాలకు వినియోగిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. నిధులు దారి మళ్లింపును అడ్డుకోవాలని టీడీపీ ఎంపీ పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేంద్రం ఇచ్చిన రూ. 8,400 కోట్లను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించిందని పార్లమెంటులో గళమెత్తారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడ దుర్వినియోగం అయినట్టు జాతీయ ఎస్సీ కమీషన్ గుర్తించిందని టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ తెలిపారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని నవరత్నాల కింద ఎస్సీ ప్రజలకు ఇచ్చామని సాక్షాత్తు ఏపీ మంత్రే చెబుతున్నారు. ప్రభుత్వం నిధుల్ని దారి మళ్లిస్తోందని ప్రభుత్వమే స్పష్టంగా చెబుతోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కాకుండా సాధారణ నిధుల నుంచి పథకాలకు ఎందుకు ఖర్చు చేయడం లేదు ?. ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ డీఎన్ఏ అని చెప్పే వైసీపీ.. సబ్ ప్లాన్ నిధులను నిధుల్ని ఎందుకు దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటని విమర్శిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే చెప్పాలి. ఉంటే.. సబ్ ప్లాన్ నిధుల్ని నవరత్నాల కింద ఖర్చు చేయదు. ఏపీలో ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం ఖర్చు చేసింది శూన్యమే అని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా సబ్ ప్లాన్ లక్ష్యానికి తూట్లు పొడిచిందని చెప్పవచ్చు. సబ్ ప్లాన్ నిధుల్ని ఎస్సీ, ఎస్టీలకే.. సబ్ ప్లాన్ లక్ష్యానికి అనుగుణంగానే ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.