
తెలుగు సినీ ఫీల్డ్‌లో మెగాస్టర్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది అభిమానులు వారి సొంతం. ఒంటరిగా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి.. టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఇప్పుడు ఆయన సహా వారసులు కూడా సినీ సీమను ఏలుతున్నారు. ఇక ఆరున్నర పదుల వయసులో ఆయన టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు. చిరంజీవి జీవితంలో సినిమాలదే అగ్ర తాంబూలం, మధ్యలో ఆయన రాజకీయాల వైపు చూసినా కూడా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.
రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు చిరంజీవి. చివరకు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. చివరకు కేంద్రం మంత్రి పదవిని పొందారు. ఆయన వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. ఇక రాజకీయాల్లో ఆయన దూకుడే వేరు. ఆయన మాటలు, ఆవేశపు ప్రకటనలు కొంత మాస్‌ను కట్టిపడేస్తాయి. తన అన్న చిరంజీవి చేసిన తప్పులు చేయకుండా.. తనదైన శైలిలో రాజకీయాల్లో ముందుకు సాగాలని అనుకున్నాడు. అయితే ఆవేశమే తప్ప సరైన ఆలోచనా విధానం లేకపోవడం వల్ల ఆయన ఆరేళ్లుగా అక్కడే ఉన్నారు తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. మరోవైపు చిరంజీవి నీడ కూడా రాజకీయంగా పవన్ కి అడుగడుగునా అడ్డుపడుతోందన్న మాట కూడా ఉంది.
రాజకీయాలు అంతలా అచ్చిరాకపోవడంతో చిరంజీవి ఎప్పుడు తప్పుకున్నారు. ఈ వయసులో తనకు పాలిటిక్స్ ఎందుకని ఆ మధ్య మీడియా ముఖంగానూ వెల్లడించారు. అయితే చిరంజీవి టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెద్ద దిక్కుగా మారిపోయారు. దాసరి నారాయణరావు తరువాత టాలీవుడ్‌కు ఆ స్థాయి ఫేస్ లేకపోవడంతో మెగాస్టార్ ఆ లోటుని భర్తీ చేస్తున్నారు. ఇలా ఆయన సినీ రంగానికి సంబంధించిన సమస్యలను ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల వద్ద తరచూ ప్రస్తావిస్తున్నారు. దాంతో ఆయనకు వారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందన్న ప్రచారం కూడా మరో వైపు జరిగిపోతోంది.
చిరంజీవి వైఖరి కాస్త జనసేనాని పవన్‌కు ఇబ్బందిగా మారిందట. తాను రాజకీయంగా విభేదిస్తున్న నేతలను స్వయానా తన అన్న కలవడం వల్ల తన ప్రయత్నాలు వృథా అవుతున్నాయనే భావన పవన్‌లో వచ్చిందట. తరచూ కేసీఆర్‌తో చిరంజీవి భేటీ అవుతూ సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావనకు తెస్తున్నారు. తెలంగాణాలో బీజేపీతో కలిసి కేసీఆర్ మీద పోరాడాలనుకుంటున్న జనసేనాని పవన్‌కు ఈ కలయికలు ఇబ్బందిగా ఉంటున్నాయట. మరోవైపు ఏపీ సీఎం జగన్‌ను ఇప్పటికే రెండుసార్లు కలిశారు. మరోమారు కలిసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. దాంతో పవన్ జగన్ మీద ఎక్కుపెడుతున్న బాణాలు కూడా వెనక్కి తిరిగివచ్చేలా పరిస్థితి ఉందంటున్నారు. అయితే.. ఈ విషయంలో చిరంజీవిని సైతం తప్పుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు టాలీవుడ్‌కు పెద్ద దిక్కు చిరంజీవి. ఆయన రాజకీయాలకు అతీతంగా ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి తన సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.