https://oktelugu.com/

Anand Mahindra: జీ20 అతిథులకు అరకు కాఫీ గిఫ్ట్‌.. ఆనంద్‌ మహీంద్రా పోస్టు వైరల్‌..!

జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అరకు కాఫీలను కేంద్రం గిఫ్ట్‌గా ఇచ్చింది. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 17, 2023 / 04:31 PM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra: జీ20 సమ్మిట్‌ను దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల అట్టహాసంగా నిర్వహించింది కేంద్రం. రెండు రోజుల పాటు జరిగిన సదస్సుకు 30 మంది దేశాధినేతలతోపాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరయ్యారు. కేంద్రం ఈ సదస్సును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. న భూతో న భవిష్యత్‌ అనే రీతిలో ఏర్పాట్లను చేసింది. అంగరంగ వైభవంగా సమావేశం జరిగింది. అయితే ఈ సమ్మిట్‌కు వచ్చిన అథితులకు కేంద్రం ఆంధ్రాకు చెందిన ఓ కానుక అందించింది. దీనికి సంబంధించిన వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

    క్వాలిటీ కాఫీ కానుక..
    జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అరకు కాఫీలను కేంద్రం గిఫ్ట్‌గా ఇచ్చింది. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. అరకు బోర్డు ఛైర్మన్‌గా ఈ ఘనత తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

    ప్రపంచస్థాయి గుర్తింపు..
    జీ20 అతిథులకు కేంద్రం ఇచ్చిన కాఫీ గురించి ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ‘అరకు బోర్డు ఛైర్మ¯Œ గా నాకు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. అరకు కాఫీని గిఫ్ట్‌గా ఇవ్వడంపై నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రపంచంలోనే అత్యంత కాఫీ ఉత్పత్తుల్లో ఇండియా అరకు కాఫీ కూడా ఒకటి. ఇది మనకు ఎంతో గర్వకారణం’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. జీ20 సమావేశం నుంచి వెనుదిరుగుతున్న విదేశీ నేతలకు కేంద్రం అరకు కాఫీలను గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను షేర్‌ చేశారు.

    ఘనమైన ఆతిథ్యం..
    సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు హాజరైన అతిథులకు భారత్‌ ఘనంమైన ఆతిథ్యం ఇచ్చింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే సమ్మిట్‌కు ప్రపంచ స్థాయి నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. అందు కోసం ఢిల్లీలోని హోటళ్లు ప్రత్యేకమైన రీతిలో వీవీఐపీలకు వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం అందించారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించింది.

    తెలుగు కానుక…
    అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల్లో దీనిని ఎక్కువగా పెంచుతారు. ప్రత్యేకమైన సుగంధ లక్షణాలు కలిగి రుచికి ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీని గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలోని తూర్పు కనుమలలో ఉన్న సుందరమైన అరకు లోయ పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 2008లో ఏర్పాటు చేసిన నంది ఫౌండేషన్‌ అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంలో తోడ్పాటునిచ్చింది. ఈ కాఫీని జీ20 అతిథులకు భారత్‌ తరఫున ఇచ్చిన అనేక కానుకల్లో కేంద్రం అరకు కాఫీని కూడా చేర్చింది.