
High Profile Cases: శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలతో పాటు మీడియా.. ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు. వీటిలో ఏ ఒక్కటీ మరో దానిపై ప్రభావం చూపినా అది ప్రజాస్వామ్యానికే ముప్పు. దేశభద్రతకు ప్రమాదం వాటిల్లినట్టేనని పెద్దలు చెప్పారు. ఇప్పటికీ చెబుతూ వస్తున్నారు. అలాగని పెద్దలు చెప్పినట్టు అమలవుతుందా? అంటే అదీ లేదు. అంతర్గత జోక్యాలు పెరుగుతున్నాయి. ఆ వ్యవస్థలకు మాయని మచ్చలు తెస్తున్నాయి. రాజ్యాంగ లక్ష్యాలను కాపాడుతూ ఆ వ్యవస్థలన్నీ స్వేచ్ఛగా పనిచేస్తున్నాయా? అంటే అదీలేదు. మన రాజ్యాంగ మూల సూత్రాలను ఏ వ్యవస్థ అయినా ఉల్లంఘించేలా వ్యవహరిస్తే కట్టడి చేసే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు కట్టబెట్టారు మన రాజ్యాంగ నిర్మాతలు. కానీ అటువంటి వ్యవస్థకు కూడా మకిలి అంటుకునే పరిస్థితి దాపురించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై ప్రొఫైల్ కేసులు తీసుకుంటే ఇది ఇట్టే అవగతమవుతుంది. ఈ రెండు కేసులూ పాలక పక్షాల కుటుంబాలకు చెందిన వారివే కావడం గమనార్హం.
నిందితుల కోరికతో విచారణ అధికారి మార్పు…
ఏపీ విషయానికే వద్దాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఎంత హీట్ పుట్టించిందో అందరికీ తెలిసిందే, రేపో మాపో కీలక నిందితులు అరెస్ట్ లు అన్నంతదాకా పరిస్థితి వచ్చింది. దాదాపు విచారణ పూర్తయిన సంకేతాలు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో సీన్ మారిపోయింది. కేసు స్వరూపమే మారిపోయింది. ఏకంగా విచారణ అధికారినే మార్పే పరిస్థితి వచ్చింది. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తన ముందస్తు బెయిల్ రద్దుచేసుకునేటంత ధైర్యాన్ని ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పట్టు బట్టి మరీ వివేకా కేసు దర్యాప్తు అధికారిని తప్పించారు. ఆ దర్యాప్తు అధికారి మీద నిందితులు పదే పదే ఫిర్యాలు చేస్తున్నారు. కేసులు పెట్టించారు. చివరికి నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లి తాము అనుకున్నది సాధించారు.
రెండుసార్లు విచారించినా అరెస్ట్ లేదు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. అరెస్టులన్నీ పూర్తయ్యాయి. ఇక కవిత అరెస్టే మిగిలి ఉందన్న రేంజ్ లో ప్రచారం చేశారు. రెండుసార్లు విచారణకు పిలిచారు..విడిచిపెట్టేశారు. ఇప్పుడు మూడోసారి రావాల్సి ఉంటుందని లీకులిస్తున్నారు. కానీ అది జరిగే పనేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణలో పొలిటికల్ డ్యామేజ్ తప్పదు.. బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ తప్పకుండా ఉంటుంది. నిఘా వర్గాలు వాటినే హెచ్చరించేసరికి దర్యాప్తు నెమ్మదించింది. ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉంది. అయితే దీనిని సజీవంగా ఉంచి అనుకూల సమయంలో బయటకు తీస్తారన్న టాక్ ఒకటి ఉంది.

30లోగా దర్యాప్తు సాధ్యమా?
వివేకా మర్డర్ కేసు కూడా అదే. మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, పైగా మాజీ మంత్రి, ఎంపీ కూడా. చనిపోయిన నాలుగేళ్లవుతున్నా కేసు విచారణ కొలిక్కి రాలేదు. చార్జిషీట్లు మారుతున్నాయి.. సిట్లు మారుతున్నాయి. విచారణ అధికారులు మారుతున్నారు. కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. తాజాగా సుప్రీం ఆదేశాలతో విచారణ అధికారిని తప్పించి కొత్త సిట్ ను నియమించారు. కానీ ఇప్పుడు ఆ కేసును సిట్ పట్టించుకుంటుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఏప్రిల్ 30లోపు దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారు కానీ… ఇంకా రంగంలోకి దిగలేదు సిట్. తెలుగునాట హై ప్రొఫైల్ కేసులను తాత్కాలికంగా కోల్డ్ స్టోరేజీలో పెట్టేశారు. అవసరమైనప్పుడు వాటిని బయటకు తీసేందుకు సిద్ధంగా ఉంచుకున్నారన్న మాట. అంటే రాజకీయాల కోసం ఈ కేసులను సజీవంగా ఉంచారన్నమాట.