Homeట్రెండింగ్ న్యూస్DR Macherla Radha Case: డాక్టర్‌ మొగుడే యముడయ్యాడు.. వైద్యురాలి హత్య కేసులో షాకింగ్ నిజాలు..

DR Macherla Radha Case: డాక్టర్‌ మొగుడే యముడయ్యాడు.. వైద్యురాలి హత్య కేసులో షాకింగ్ నిజాలు..

DR Macherla Radha Case: ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకోవడం చూశాం. తండ్రిని కొడుకులు హతమార్చిన ఘటనలు ఉన్నాయి. తాత, నానమ్మలను కూడా చంపిన ఉందంతాలను చూశాం. కానీ, ఇక్కడ రోగుల ప్రాణాలు కాపాడే ఓ వైద్యుడు అత్యంత క్రూరంగా తన భార్యను హతమార్చాడు. ఆరు పదుల వయసు దాటిన వయసులో ఆస్తులపై మమకారంతో దాంపత్య బంధానికి, వైద్య వృత్తికి కళంకం తెచ్చాడు.

వీడిన వైద్యురాలి హత్య మిస్టరీ..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైద్యురాలు మాచర్ల రాధ హత్య కేసులో పిల్లల వైద్య నిపుణుడైన ఆమె భర్త లోక్‌నాథ్‌ మహేశ్వరరావును ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతనితోపాటు హత్యకు సహకరించిన కారు డ్రైవర్‌ మధును అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. శుక్రవారం ఎస్పీ పి.జాషువా ఈ కేసు వివరాలు వెల్లడించారు. వైద్య దంపతులైన మహేశ్వరరావు, రాధ మచిలీపట్నం జవ్వారుపేటలోని సొంత వైద్యశాలలో 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. గత నెల 25న రాత్రి తన భార్యను హత్య చేసి నగలు అపహరించుకుపోయారంటూ వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భర్తే హత్య చేసినట్టు తేలింది. 15 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తున్న మధుకు పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు ఆశ చూపి హత్యకు సహకరించేలా ఒప్పించిట్లు తెలిపారు. కోట్ల విలువైన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదాలే హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు.

పక్కా ప్రణాళికతో..
జూలై 25వ తేదీ సాయంత్రం ఆసుపత్రి రెండో అంతస్తులో ఒంటరిగా ఉన్న రాధ వద్దకు లోక్‌నాథ్, డ్రైవర్‌ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా భర్త రెంచితో తల వెనుక దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. పోలీసు జాగిలాలకు ఆధారాలు దొరకకుండా వైద్యుడి సూచన మేరకు మధు ఆ ప్రదేశం మొత్తం కారం చల్లాడు. అతడు దానిని దగ్గరలోని ఓ సూపర్‌ మార్కెట్‌ నుంచి కొని తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో దొంగతనం జరిగిందనేలా ఆమె ధరించిన నగలు తీసేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు మహేశ్వరరావు కింది అంతస్తులోని ఆసుపత్రికి వచ్చి రోగులను చూశాడు. రాత్రి 10.30 వరకు ఆసుపత్రిలోనే కాలక్షేపం చేసి అప్పుడు హత్య జరిగిందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

భర్తలో కనిపించని బాధ.
దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వైద్యుడి పైనే అనుమానం కలిగింది. భార్య చనిపోయిందన్న బాధ, ఆవేదన ఆయనలో ఏ మాత్రం కనిపించలేదు. హత్య జరిగిన మరుసటిరోజే ఓపీ చూడడం వంటి చర్యలు వైద్యుడిపై అనుమానాలను రేకెత్తించాయి. లోతుగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular