
AP Global Investors Summit: ఇప్పుడు అందరి దృష్టి సాగరనగరంపైనే ఉంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు రోజుల పాటు విశాఖలో జరగనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు విశాఖ ముస్తాబైంది. ఏపీలో పారిశ్రామికాభివృద్ధి లేదంటూ గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ చెప్పేలా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించింది. సమ్మిట్ ను విజయవంతంగా పూర్తిచేయాలన్న సంకల్పంతో కర్టైన్ రైజర్ గా ఈవెంట్లను నిర్వహించింది. పెద్దఎత్తున ప్రచారం కల్పించింది. సమ్మిట్ పై అంచనాలు పెంచేసింది. కాగా ఈ సదస్సు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఏపీలో ఉన్న సానుకూల అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
ఇప్పటికే ఏపీ సీఎం జగన్ విశాఖ చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు విశాఖలోనే మకాం వేశారు. ఆరుగురు కేంద్ర మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులు సైతం రెండు రోజుల పాటు విశాఖలో ఉండి కార్యకలాపాలు కొనసాగించనున్నారు. రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రెండు రోజుల సదస్సు కొనసాగనుంది. 26 దేశాల నుంచి 8 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీరందరికీ ఆతిథ్య ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకుగాను ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఐఐ సదస్సుల సమయంలో నాడు విపక్షంగా ఉన్న వైసీపీ ఎన్నెన్నో ఆరోపణలు చేసింది. ఎగతాళి కామెంట్స్ చేసింది. గోబెల్స్ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి ప్రచారానికి చెక్ చెప్పేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
టీడీపీ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సారధ్యంలో వరుసగా మూడేళ్ల పాటు సీఐఐ సదస్సులు కొనసాగాయి. కానీ ఈ సారి ఏపీ సర్కారు సోలోగానే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం అతిథి పాత్రకే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, పియూష్ గోయల్, ఆర్కేసింగ్, కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా చైర్మన్ కుమారమంగళంతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు సదస్సుకు హాజరుకానున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సైతం ఏపీ సర్కారు ఆహ్వానించింది.

సాగరనగరం ఎటుచూసినా ఇప్పుడు అంతర్జాతీయ సదస్సు ఆహ్వానాలే కనిపిస్తున్నాయి. దారిపొడవునా ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. కాగా సదస్సు ప్రారంభ ఉపన్యాసం సీఎం జగన్ చేయనున్నారు. ఉదయం 9.45కి సదస్సుప్రారంభం కానుంది. లేజర్ షో ఏర్పాటుచేశారు. మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం స్టార్ట్ కానుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మంత్రులను ఆహ్వానించనున్నారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సదస్సు ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించనున్నారు. 21 మంది పారిశ్రామిక వేత్తలు సదస్సును ఉద్దేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 20 నిమిషాల పాటు జగన్ ప్రసంగించనున్నారు.