SSC Student: పరీక్షల్లో విద్యార్థులు ఇటీవల మితిమీరిన తెలివి ప్రదర్శిస్తున్నారు. ప్రశ్నలకు జవాబులు సొంత పరిజ్ఞానంతో చాలా మంది విద్యార్థులు రాస్తున్నారు. విషయంపై అవగాహనతో సమాధానాలు రాస్తున్నారు. అయితే కొంతమంది కొంటె విద్యార్థులు వింతైన సమాధానం రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి రామాయణం ప్రాశస్త్యం తెలపండి అని అడిగిన ప్రశ్నకు రాసిన సమాధానం చూసి ఉపాధ్యాయుడు షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ విద్యార్థి ఏం రాశాడో తెలుసా?
మార్కులు వేయకుంటే చేతబడి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల్లో తెలుగులో రామాయణం ప్రాశస్త్యం గురించి ప్రశ్న అడిగారు. దీనికి ఓ విద్యార్థి ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. ఈ సమాధానం రాసిన జవాబు పత్రం బాపల్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడికి దొరికింది. ఆ సమాధానం చదివిన ఉపాధ్యాయుడు షాక్ అయ్యాడు. వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు.
ఆ విద్యార్థికి 70 మార్కులు..
ఈ ప్రశ్నపత్రం ఏ విద్యార్థిదో తెలియదు. కానీ, ఈ పరీక్షలో ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం మరో విశేషం. అయినా సదురు విద్యార్థి తనకు తెలియని ప్రశ్నకు సమాధానం రాయకుండా ఇలా చేతబడి చేయిస్తానని రాయడంతో దానిని చదివిన ఉపాధ్యాయుడు అవాక్కయ్యాడు. ఇదే పరీక్షలో మరో ప్రశ్న రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు ‘ మంధర.. శివాజీ, మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాశాడు. అది చూసిన ఉపాధ్యాయులు విస్తుపోయారు.
తుంటరి సమాధానాలు..
గతంలో ప్రశ్నలకు సమాధానం రాకపోతే రాయకుండా వదిలేసేవారు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు సమాధానం రాకున్నా ప్రశ్నను అర్థం చేసుకుని అవగాహన మేరకు సమాధానం రాయాలని సూచిస్తున్నారు. ఎన్నో కొన్ని మార్కులు వస్తాయన్న ఉద్దేశంతో ఇలా చెబుతున్నారు. కానీ, విషయంపై అవగాహన లేక, బట్టీ చదువులతో ఏం సమాధానం రాయాలో తెలియక విద్యార్థులు ఇలా తుంటరి సమాధానాలు రాస్తున్నారు.