
Anil Agarwal: ఇప్పటికే అదానీ గ్రూప్ నేల చూపులు చూస్తోంది. హిండెన్‌బర్గ్ నివేదికతో కకావికలం అవుతోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. బయటకు చెప్పడం లేదు కాని రూ. లక్షల కోట్లల్లో సంపదా ఆవిరి అయిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి దాకా మనం అదానీనే అనుకున్నాం కానీ.. ఇప్పుడు అప్పుల భారంతో మన దేశానికి చెందిన మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ పుట్టి మునిగే సూచనలు కనిపిస్తున్నాయి. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్.. గౌతమ్ అదానీ తరహాలోనే పీకల్లోతు అప్పులతో సతమతమవుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబరు నుంచి వచ్చే జనవరి లోపు ఈయన నిర్వహణలోని వేదాంత రీసోర్సెస్ 150 కోట్ల డాలర్ల (రూ.12,400 కోట్లు) రుణ పత్రాల అప్పులు చెల్లించాలి. అయితే కొత్త అప్పుల ద్వారా ఈ మొత్తం సేకరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇప్పటివ రకు ఫలించలేదు.
ప్రభుత్వం నుంచి షాక్
హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) ఈక్విటీలో అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్‌కు 65 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ప్రతి త్రైమాసికానికి 30 నుంచి 60 కోట్ల డాలర్ల స్థూల లాభం ఆర్జిస్తోంది. అన్నిటి కంటే ముఖ్యంగా ఈ కంపెనీ వద్ద దాదాపు 200 కోట్ల డాలర్ల (దాదాపు రూ.16,500 కోట్లు) మిగులు నిధులు ఉన్నాయి. విదేశాల్లోని వేదాంత జింక్ గనుల కొనుగోలు ద్వారా.. ఈ మిగులు నిధులను, వేదాంత లిమిటెడ్ ఖాతాలోకి మళ్లించేందుకు అనిల్ అగర్వాల్ శతవిధాలా ప్రయత్నించారు. హెచ్‌జెడ్‌ఎల్ ఈక్విటీలో ఇంకా 30 శాతం వాటా ఉన్న ప్రభుత్వం ఇందుకు నిరాకరించడంతో ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బాండ్స్ పరపతి రేటింగ్ పడిపోయింది.
వేదాంత రీసోర్సెస్ ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉందని తెలియడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆ కంపెనీ బాండ్స్ పరపతి రేటింగ్ పడిపోయింది. దీంతో ఒక డాలర్ ముఖ విలువ ఉండే ఈ బాండ్స్ 70 సెంట్స్ వద్ద ట్రేడవుతున్నాయి. పరపతి రేటింగ్ సంస్థలైతే ఈ బాండ్స్ రేటింగ్‌ను అణాకానీ కూడా విలువ లేని జింక్ స్థాయిని కుదించాయి. ఈ పరిణామాలతో త్వరలోనే అనిల్ అగర్వాల్ కూడా గౌతమ్ అదానీలాగానే తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అప్పులు కుప్ప
ప్రస్తుతం అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ నెత్తిన 1,530 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.26 లక్షల కోట్లు) అప్పు ఉంది. ఇందులో భారతీయ బ్యాంకుల వాటా 673 కోట్ల డాలర్ల (సుమారు రూ.55,677 కోట్లు) వరకు ఉంటుంది. ఈ మొత్తం అప్పుల్లో 120 కోట్ల డాలర్లు గత ఏడాది సెప్టెంబరు నాటికి, 410 కోట్ల డాలర్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో, 390 కోట్ల డాలర్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో, 470 కోట్ల డాలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరం, ఆ తర్వాత చెల్లించాలి. ఇంత పెద్ద మొత్తంలో అప్పుల చెల్లింపులకు అవసరమైన భారీ ఆస్తులు గానీ, నిధులు గానీ ప్రస్తుతం వేదాంత గ్రూప్ వద్ద లేవు.