Anchor Suma: సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ చిరంజీవి ఎలాగో బుల్లితెరపై సుమ అలాగన్న మాట. యాంకర్ గా ఆమె నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తన మాటల గారడీతో దశాబ్దాల పాటు యాంకరింగ్ లో ఏకఛత్రాధిపత్యం చేసింది. సమయస్ఫూర్తి, మూడు నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడగల ప్రతిభ ఆమెను తిరుగులేని యాంకర్ ని చేశాయి. షో ఏదైనా సుమ యాంకర్ అయితే టీఆర్పీ పరుగులు పెట్టాల్సింది. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి లెజెండరీ షోలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పట్టుకుంటే పట్టుచీర, భలే ఛాన్స్ లే, మహిళలు మహారాణులు వంటి లేడీస్ షోలు ఏళ్ల తరబడి కొనసాగాయి.

యంగ్ జనరేషన్ వచ్చినా కూడా 47 ఏళ్ల సుమకు తిరుగులేకుండా పోయింది. స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ నుండి నంది అవార్డ్స్ వంటి భారీ వేదికలకు కూడా సుమనే అందరి ఛాయిస్. సుమ జైత్రయాత్ర చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. అలాంటి సుమ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పనున్నారన్న వార్త షాకింగ్ గా మారింది ఇటీవల ఓ షోలో పాల్గొన్న సుమ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
చాలా రోజులుగా సుమ యాంకరింగ్ మానేస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. ఈసారి ఆమె స్వయంగా తెలియజేశారు. ‘ఒక మలయాళీ అమ్మాయిని అయిన నేను ఇక్కడ సెటిల్ కావడం నిజంగా అదృష్టం. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలతోనే ఇది సాధ్యం అయ్యింది. అందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంత కాలం యాంకరింగ్ కి విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. అయితే పూర్తిగా యాంకరింగ్ కి దూరం కాను, అని చెప్పుకొచ్చారు. కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తానని చెప్పారు. అయితే సుమ యాంకర్ గా రిటైర్ అయ్యారనే మాట వినిపిస్తోంది.

ఈ మాటలు చెప్పేటప్పుడు సుమ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సుమకు అవకాశాలు తగ్గాయి అనడంలో సందేహం లేదు. యాంకరింగ్ టాలెంట్ కి మించి గ్లామర్ యాంగిల్ తీసుకున్నాక ట్రెడిషనల్ యాంకర్స్ కి ఆఫర్స్ తగ్గాయి. రష్మీ, శ్రీముఖి, వర్షిణి, అనసూయ వంటి బోల్డ్ బ్యూటీస్ ఈ రంగంలో దూసుకుపోతున్నారు. అలా అని సుమ చేతిలో షోస్ లేవని కాదు. ప్రస్తుతం ఆమె క్యాష్ షో యాంకర్ గా ఉన్నారు. క్యాష్ చాలా కాలంగా ప్రసారం అవుతుంది.