Jagan: ఒక్కోసారి దూకుడు రాజకీయంగా కలిసి వస్తోంది. ఇంకొన్ని సార్లు కోలుకోలేని దెబ్బతీస్తుంది. అయితే ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ ఎంత ఉపకరిస్తుందో.. వ్యూహాలు కూడా అంతే బాగా వర్కవుట్ అవుతాయి. గత ఎన్నికల్లో జగన్ కు పోల్ మేనేజ్ మెంట్ నుంచి వ్యూహాల వరకూ అన్నీ ఫలించాయి. అంతులేని విజయాన్ని కట్టబెట్టాయి. గత ఎన్నికలను పరిశీలిస్తే మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినట్టు తెలుస్తుంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సర్కారు నుంచి మంచి సపోర్టు లభించింది. అటు చంద్రబాబుపై కోపంతో బీజేపీ ‘వ్యవస్థ’పరంగా హెల్ప్ చేసింది. ఆపై రాష్ట్రంలో ఉన్న అన్నివర్గాలు సహకరించాయి. దీంతో జగన్ పార్టీకి కనివినీ ఎరుగని రీతిలో మెజార్టీ దక్కింది. అయితే గత ఎన్నికలకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అంటే లేవని చెప్పాలి. వాటని జగనే ఏరికోరి దూరం చేసుకుంటున్నారు. ఒక రెండు అంశాలు జగన్ కు మైనస్ గా మారాయి. వాటిని మాత్రం ఆయన మార్చుకోకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో భారీ దెబ్బ తగిలే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేసింది. పార్టీకి సంస్థాగత నిర్మాణం తక్కువ. లక్షలాది మంది అభిమాన గణం ఉన్నా.. వారిని సమన్వయం చేసి పోలింగ్ బూత్ లకు తీసుకువెళ్లే యంత్రాంగం లేకుండా పోయింది. అయినా సరే చెప్పుకోదగ్గ ఓట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే నాడు పవన్ ను అభిమానించే వారు సైతం వైసీపీకి ఓటు వేయడం. పవన్ జనసేన తరుపున నిలబెట్టిన క్యాండిడేట్లు కొత్తవారు కావడం, పైగా వైసీపీ దూకుడు మీద ఉండడం, నాటి చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పవన్ అభిమానులు చాలా మంది వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఇలా గత ఎన్నికల్లో ఓటువేసిన చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు. పైగా సీఎం జగన్ నుంచి కింది స్థాయి నేతల వరకూ పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల సీఎం జగన్ పవన్ వివాహ జీవితంపై మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు. వారంతా ఇప్పుడు జనసేనకు పూర్తిస్థాయిలో పోలరైజ్ అవుతున్నారు.

బలమైన సిద్ధాంతాలను పునాదిగా చేసుకుంది భారతీయ జనతా పార్టీ. హిందుత్వంతో పాటు కొన్ని సైద్ధాంతిక విధానాలను తప్పకుండా పాటిస్తుంది. అందుకే రెండు స్థానాలున్న జనసంఘ్.. ఇప్పుడు బీజేపీగా సుపరిచితమై అశేష భారతావనిని విస్తరించింది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు వ్యవహార శైలితో బీజేపీ వైసీపీకి అన్నివిధాలా సహకరించింది. అప్పటికే చంద్రబాబు చర్యలతో పార్టీ కోలుకోలేని దెబ్బతిని ఉంది. పార్టీకి మిగిలిన కొద్దిపాటి ఓట్లు సైతం వైసీపీకే మళ్లించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ వ్యవహార శైలి బీజేపీ శ్రేణులకు నచ్చడం లేదు. వ్యవస్థాగత విమర్శలన్నదే బీజేపీ అభిమతం. వ్యక్తిగత కామెంట్స్ కూ ఆ పార్టీ దూరం. కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగత ఎదురుదాడినే అస్త్రాలుగా చేసుకుంది. పైగా వయసు, ఇతరత్రా గౌరవాలు చూడకుండా.. చిన్నాపెద్ద తేడాల లేకుండా వైసీపీ నేతలు విమర్శలకు దిగుతుంటారు. ఇది బీజేపీ శ్రేణులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. దీని వెనుక జగన్ ప్రోత్సాహం ఉందని నమ్ముతున్న కాషాయ దళం.. నాడు చంద్రబాబుపై చూపిన ఆగ్రహం.. ఇప్పుడు జగన్ పై చూపడం ప్రారంభించారు. అటు పవన్ పై వ్యక్తిగత దాడిని కూడా మిత్రపక్షంగా బీజేపీకి రుచించడం లేదు. సో ఈ రెండు అంశాలు జగన్ సర్కారుకు చేటు తెస్తాయన్న మాట.