Vangaveeti Radha Krishna: ఆయన మావాడంటే మావాడు. ఆయన వారసుడికి అన్యాయం మీరు చేశారంటే మీరు చేశారు.. ఇది వంగవీటి కుటుంబం విషయంలో మూడు దశాబ్దాలుగా వినిపించే మాట. 34 సంవత్సరాల కిందట వంగవీటి మోహన్ రంగా హత్యకు గురయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హత్యకు గురికాగా.. అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ నిగ్గు తేల్చలేకపోయింది.పైగా రంగాను హత్య చేయించడంలో సహకరించిందన్న అపవాదును మూటగట్టుకుంది అటు తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఎటూ తేల్చలేకపోయాయి. తమ సొంత పార్టీ నాయకుడు, పైగా కోట్లాది మంది అభిమానించే ఓ లెజెండరీ నేత హత్యకు గురైనా న్యాయం చేయలేకపోయారు. ఎవరు? ఎందుకు చేశారు? అన్నది తేల్చలేకపోయారు కానీ.. రంగా హత్యను రాజకీయ అంశంగా సజీవంగా ఉండడంలో అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు రంగా వారసుడితో అన్ని రాజకీయ పక్షాలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉండగా.. స్నేహం మాటున కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లను అధికా పార్టీ ప్రయోగిస్తోంది. రాధాకృష్ణకు వైసీపీ అంటే గిట్టడం లేదు. ఆ పార్టీ అంటేనే మండిపడుతున్నారు. కానీ నాని, వంశీలు మాత్రం ఆయనతో అంటగాకుతున్నారు. కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు టీడీపీ కూడా రాధా మావాడేనిని పదే పదె చెబుతోంది. అటు రాధా సైతం అప్పుడప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. అయితే ఇంతా రాధాను ఓన్ చేసుకుంటున్న పార్టీలు ఆయన మెచ్చే రాజకీయ ఉన్నతికి మాత్రం మార్గం చూపించడం లేదు.
రంగా వారసుడిగా గుర్తించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో తొలిసారిగా రాధాకృష్ణతో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అతి పిన్నవయసులో రాధా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కేవలం రంగా వారసుడిగానే కాకుండా.. తాను సొంతంగా కూడా బలపడాలన్న క్రమంలో రాధా కొన్ని తప్పటడుగులు వేశారు. శర వేగంగా పార్టీలు మారడం, పర్యవసానాలు పట్టించుకోకపోవడం, లాభ నష్టాలు భేరీలు వేసుకోకపోవడం వంటి కారణాలతో పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ఆయన బలహీనతను రాజకీయ పక్షాలు క్యాష్ చేసుకున్నాయి. రంగా అనే మాస్ ఇమేజ్ ను ఆయన వారసుడి నుంచి ఉపయోగించుకుంటున్న పార్టీల.. రాజకీయంగా పదవులు ఇచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపుతున్నాయి.

2004లో తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసిన రాధాక్రిష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీలో చేరారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. అయితే వైసీపీలో రాధాకు ప్రాధాన్యంతగ్గింది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ స్థానం కేటాయించకపోవడంతో రాధా టీడీపీలో చేరారు. అప్పటికే మల్లాది విష్ణు ఉండడంతో ఆయనకు కాదని టిక్కెట్ ఇవ్వలేమని జగన్ తేల్చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రాధా టీడీపీలో చేరారు. పోనీ అక్కడైనా టిక్కెట్ హామీ లభించిందా అంటే అదీ లేదు. కేవలం వైసీపీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక దెబ్బతీయ్యాలన్న ఆకాంక్షతో టీడీపీలో చేరారు. కానీ టీడీపీ కూడా రాధాక్రిష్ణకు సరైన సాయం చేయలేదు. ఆయనకు ఇష్టమైన నియోజకవర్గం కేటాయించలేదు.
అయితే రాధాను పార్టీలు దెబ్బతీశాయనేదాని కంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.అందుకే ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆయన జనసేన గూటికి చేరే చాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. పవన్ కూడా రాధాకు పార్టీలో సముచిత స్థానం కల్పించనున్నట్టు హామీ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి, క్రిష్ణ, గుంటూరు బాధ్యతలను పవన్ కళ్యాణ్ రాధాక్రిష్ణకు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో పొత్తుల అంశం ఒక కొలిక్కి వచ్చిన తరువాతే ఆయన రాజకీయంగా స్టెప్ వేసే అవకాశముందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అప్పటివరకూ కాపునాడు యాక్టివిటీస్ తో పాటు మోహన్ రంగా పేరిట కార్యక్రమాల్లో విరివిగా పాల్లొనాలని రాధా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.