Viral News : అతని పేరు రాహుల్. ఓ బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థలో అతనికి చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అయితే ఆ కంపెనీ అతడు ఊహించిన విధంగా ఇంక్రిమెంట్ వేయలేదు. జీతంలో పెరుగుదల లేక.. చేస్తున్న ఉద్యోగంపై ఆసక్తి లేక అతడేకంగా.. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన హెచ్ఆర్ మేనేజర్ కు వినూత్నంగా లేఖ రాశాడు. ” ఇన్ని సంవత్సరాల బాండింగ్ మీతో ఉన్నప్పటికీ నా జీతంలో గ్రోత్ లేదు. ఇది నా భవిష్యత్తు లక్ష్యాలను స్తంభింపచేస్తోంది. డిసెంబర్ 5న నాకు ఎంతో ఇష్టమైన IQ 0013 అనే ఫోన్ ను బుక్ చేయాలి అనుకున్నాను. ఇది ఇండియాలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఫోన్. దాని ధర ₹51,999. నాకు వచ్చే జీతం అది సాధ్యం కాదు. జీతం ఇలానే ఉంటే నా వృద్ధి ఆగిపోతుందని అనుకుంటున్నాను. అందువల్లే కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాను.. నా చివరి పని దినం డిసెంబర్ 4 2024. నాకు ఎంతో అనుభవాన్ని ఇచ్చారు. జ్ఞాపకాలను కూడా అందించారు.. ప్రేమతో మీరు రాహుల్” అంటూ అతడు తన రాజీనామా లేఖను రాశాడు. తన జీతంలో పెరుగుదల లేక కనీసం నచ్చిన ఫోన్ కూడా కొనుగోలు చేయలేకపోతున్నారని అతడు తన రాజీనామాలేఖలో ప్రస్తావించడం సంచలనాన్ని సృష్టిస్తోంది. అయితే తన పని చేస్తున్న కంపెనీ పేరును రాహుల్ కనిపించకుండా చేశాడు.. అతడు లేఖ రాసిన విధానం చూస్తే అతి బహుళ జాతి ఐటీ సంస్థ అని అర్థమవుతోంది. ఎందుకంటే కొంతకాలంగా దేశంలో ప్రత్యేకించి కొన్ని సంస్థలు ఉద్యోగుల జీతాలలో పెంపుదలను ప్రకటించడం లేదు. దానివల్ల చాలామంది ఉద్యోగులు మూన్ లైటింగ్ కు అలవాటు పడుతున్నారు. అప్పట్లో ఇది సంచలనం కలిగించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థమై కంపెనీలు మిన్నకుంటున్నాయి.
సోషల్ మీడియాలో చర్చ
రాహుల్ రాసిన రాజీనామా లేఖ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఉద్యోగుల వేతనాలలో పెంపుదలు లేకపోతే వాళ్లు మాత్రం ఏం చేస్తారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ” బహుళ జాతి సంస్థలు వేతనాల పెంపులో అంతగా ఆసక్తి చూపించినట్టు కనిపించడం లేదు. పని విషయంలో మాత్రం ఏమాత్రం కనికరం చూపించడం లేదు. ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయి. అదనపు గంటలు పని చేయించి చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను చూసి చూసి కొంతమంది ఉద్యోగులు బయటకు వెళ్ళిపోతున్నారు. వెళ్తున్నప్పుడు కంపెనీ తప్పులను చెప్పకుండా రాహుల్ లాగా నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. అవి కంపెనీ వ్యవహరిస్తున్న లోప భూయిష్టమైన విధానాలను బయటపెడుతున్నాయి. ఇప్పటికైనా బహుళ జాతి సంస్థలు మేల్కొంటే మంచిది. లేకపోతే ఉద్యోగులు ఇలానే బయటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత చింతించినా ఉపయోగముండదని” నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా రాహుల్ రాసిన రాజీనామాలేఖ. సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీస్తోంది.