
Srikakulam: ప్రపంచంలో ఇలాంటి వాళ్లు ఇంకా మిగిలే ఉన్నారని ఈ సంఘటన రుజువు చేసింది. కొన్ని చోట్ల తల్లిదండ్రుల మృతిని తట్టుకోలేని బిడ్డలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొన్ని చోట్ల అల్లారుముద్దగా పెంచుకున్న కొడుకులు, కూతుళ్లకు తల్లిదండ్రలు గుడులు కట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ కథ వేరే. పైన(బ్రహ్మ లోకంలో) ఇద్దరు కలిసి ‘‘నీవు లేక వీణా పలుకలేనన్నది’’ డ్యూయట్ వేసుకుందామని భావించి భార్య అనారోగ్యంతో చనిపోయిందని కుమిలిపోయిన ఆ భర్త ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు వీడని శోకాన్ని మిగిల్చాడు.
పెద్దల సాక్షిగా ఒకటైన ఆ జంట కలకాలం కలిసి మెలిసి జీవిద్దామని శపథాలు చేసుకున్నారు. ఎక్కడ ఉన్న కడకు వచ్చేది తనేనని చెప్పుకొని అన్నంత పని చేసేసుకున్నారు. ఈ హృదయవిధారకమైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో జరిగింది. మండలంలోని ఈసర్లపేట గ్రామానికి చెందిన మంగరాజు రాజబాబు(27)తో మౌనిక అనే ఆమెతో వివాహమైంది. ప్రస్తుతం ఇతను ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడు నెలల గర్భిణీ అయిన మౌనిక ఇటీవల అనారోగ్యానికి గురవగా, రాజబాబు తండ్రి సత్యానారాయణ విశాఖపట్నంలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించాడు.
మౌనిక అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న రాజబాబు, హర్యానాలో విధులు నిర్వహిస్తూ సెలవుపై హుటాహుటిన గ్రామానికి చేరుకున్నాడు. భార్యను చూసేందుకు విశాఖలోని ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ మౌనిక ఈ నెల 16న మృతి చెందింది. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురైన అతను అన్నపానీయాలు మానేశాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ అదో లోకంలోకి వెళ్లిపోయాడు. కుమారుడు ఏమై పోతాడోన్న బాధ తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతూ ఆందోళనకు గురై వారు కూడా మంచం పట్టే స్థితికి చేరుకున్నారు.

రాజబాబు ఈ నెల 19న ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరాదు. ఆముదాలవసలతో రైలు ఎక్కి పొందూరుకు చేరుకున్నాడు. అక్కడ అతని మనసులో ఏ పురుగు తొలచిందో ఏమో చనిపోతున్నానని మిత్రులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత ఎంత ఫోన్ చేసినా తీయకపోవడంతో, ఆందోళనతో వారంతా ఆముదాలవలస రైలు పట్టాలపై వెతకడం ప్రారంభించారు. కొంచాడ సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినట్లు ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. అది రాజబాబుదే అని తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యాభర్తల మృతితో ఈసర్లపేటలో విషాదఛాయలు అలుకుమున్నాయి. చేతికొచ్చిన కొడుకు దూరమవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వారు కూడా ఉంటారా అని ముక్కున వేలేసుకోవడం పలువురి వంతైంది.