Ram Charan: తాను ఏకంగా ఆరు చిత్రాలకు సైన్ చేసినట్లు చెప్పి రామ్ చరణ్ షాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ ప్రకటన చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అధికారికంగా రెండు ప్రాజెక్ట్స్ రామ్ చరణ్ ప్రకటించగా మిగతా నాలుగు చిత్రాల దర్శకులు ఎవరనే ఆసక్తి మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ పాన్ వరల్డ్ హిట్ కొట్టారు. ఇండియాతో పాటు యూఎస్ బాక్సాఫీస్ షేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్, జపాన్ సైతంలో సత్తా చాటుతుంది. ముత్తు, బాహుబలి 2, 3 ఇడియట్స్ చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది.

పలు అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుని దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఈ అరుదైన విజయంలో భాగమైనందుకు రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఓ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చరణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఆరు చిత్రాలు లైన్లో పెట్టినట్లు వెల్లడించారు. 2023లో మూడు ప్రాజెక్ట్ 2024లో మరో మూడు చిత్రాలు చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు.
దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ RC – 15 చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. శంకర్ ఏక కాలంలో భారతీయుడు 2 సైతం పూర్తి చేస్తున్నారు. అందుకే షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబుతో తన 16వ చిత్రం ప్రకటించారు. ఉప్పెన మూవీతో దర్శకుడిగా మారిన చిట్టిబాబు రెండో చిత్రం రామ్ చరణ్ తో చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ క్రమంలో రామ్ చరణ్ చెప్పిన మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఏమిటీ? దర్శకులు ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ చరణ్ చెప్పిన ఆరు చిత్రాల్లో ఒకటి కావచ్చనే సందేహం కలుగుతుంది. అయితే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో మూవీ ప్రకటించారు. మరో ఐదారు నెలల్లో రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ల తర్వాత విడుదలవుతుంది. కాబట్టి రామ్ చరణ్ చెప్పిన ప్రాజెక్ట్స్ లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఈ న్యూస్ జోష్ నింపింది.