Sankranthi Kodi Pandalu: ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకున్న ప్రత్యేకతే వేరు. అందులోనూ కోస్తాంధ్రాలో సంక్రాంతి జోరు మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అంతే. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ .. ఇలా మూడు రోజులూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, గుండాటలు ఇక్కడ ప్రత్యేకం. సంక్రాంతి బరిలో దిగడానికి కోడి పుంజులతో పాటు, పందెం రాయుళ్లు కూడ సిద్ధమైపోయారు.

ఒకవైపు పోలీసు హెచ్చరికలు.. మరోవైపు అధికారుల ఆంక్షలు అయినా పందెం రాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం కోడి పందేలకు పెట్టింది పేరు. అంపాపురం, హనుమాన్ జంక్షన్, ఉంగటూరు, బాపులపాడు గ్రామాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తారు. ఇప్పటికే వందల ఎకరాల్లో కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. వైసీపీకి చెందిన కీలక నేత కనుసన్నల్లో కోడి పందేల నిర్వహణ నిరాటంకంగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఒక్కో బరికి రెండు ఎకరాల చొప్పున స్థలం కేటాయించనట్టు సమాచారం.
కోడి పందేలకు వచ్చే వారిని వీఐపీ ఏ గ్రేడ్, వీఐపీ బీ గ్రేడ్, వీఐపీలుగా విభజించారట. వీఐపీ ఏ గ్రేడ్ కు రూ. 60 వేల ఎంట్రీ ఫీజు, వీఐపీ బీ గ్రేడ్ కు రూ. 40 వేల ఎంట్రీ ఫీజు, వీఐపీలకు రూ. 25 వేల ఎంట్రీ ఫీజు పెట్టారట. కోడి పందేల బరులకు ఒక్కో బరికి రూ. 5 లక్షల నుంచి లక్ష లోపు వరకు వేర్వేరు బరుల సిద్ధం చేసినట్టు సమాచారం. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు రావడంతో హోటల్ గదులు కూడ ఫుల్ అయ్యాయని సమాచారం.

పాసులు ఉన్న వారికి సకల సదుపాయాలు కల్పిస్తున్నట్టు సమాచారం. రుచికరమైన బిర్యానీలు, 15 రకాల టిఫిన్లతో వసతులు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. మూడు రోజుల పాటు సాగే కోడి పందెంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. ఇప్పటికే కోడి పుంజులను పామాయిల్ తోటల్లోకి తరలించారట. సంక్రాంతికి బరికి సిద్ధం చేస్తున్నారట.